బంజారాహిల్స్.జూన్ 23: తన తల్లిదండ్రులు చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారని యువతిని నమ్మించి లక్షలాది రూపాయల విలువైన బంగారాన్ని తీసుకుని మోసం చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన రేకుండ్ల సాయికుమార్ (21) కొంత కాలంగా యూసుఫ్‌గూడ సమీపంలోని ప్రగతినగర్‌లో ఉంటున్నాడు. గతంలో అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేసిన సాయికుమార్ కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి అవారాగా తిరుగుతున్నాడు.
మూడునెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా అదే ప్రాంతంలో నివాసముంటూ బీటెక్ చదువుతున్న నందిని(22)తో పరిచయం ఏర్పడింది. ఇటీవల ఆమెను కలిసిన సాయికుమార్ తన తల్లిదండ్రులు చావు బతుకుల్లో ఉన్నారని నమ్మించి.. చనిపోయిన తన నానమ్మ ఫొటోలు చూపించాడు. తల్లిదండ్రుల చికిత్స కోసం అత్యవసరంగా పది లక్షల దాకా కావాల్సి ఉందంటూ నమ్మబలికాడు. సాయికుమార్ మాటలతో కరిగిపోయిన ఆ యువతి తన తల్లి సూర్యప్రభకు చెందిన 24 తులాల బంగారు నగలు అతడికి ఇచ్చింది. వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలని, తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడుకోవాలని సూచించింది.
యువతి వద్దనుంచి బంగారు ఆభరణాలు తీసుకున్న సాయికుమార్ వాటిని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో కుదువ పెట్టి రూ.9లక్షలు తీసుకున్నాడు. దాంతో పాటు మరో ఏడు లక్షలు అప్పులు చేశాడు. ఈ మొత్తాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో స్పైబ్ నావిగేటర్ అనే ఆన్లైన్ గేమ్‌లో బెట్టింగ్ కాశాడు. 21రోజుల్లో మొత్తం రూ.16లక్షలు బెట్టింగ్ ద్వారా పోగొట్టిన సాయికుమార్.. బాధిత యువతికి ముఖం చాటేసి గోదావరిఖనికి పారిపోయాడు. కాగా, రెండ్రోజుల కిందట యువతి తల్లి సూర్యప్రభ తన బీరువాలో ఉండాల్సిన ఆభరణాలు కనిపించకపోవడంతో కుమార్తెను నిలదీసింది. దీంతో సాయికుమార్ తల్లిదండ్రుల చికిత్స కోసం ఇచ్చానంటూ చెప్పింది. ఈ మేరకు సూర్యప్రభ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ 406, 420, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సాయికుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.