కవాడిగూడ, సెస్టెంబర్ 4: కేంద్రంలోని 72 ప్రభుత్వ శాఖల్లో, 245 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల పైచిలుకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్కులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ వెంటనే ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేని పక్షంలో మార్చిలో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు సి.రాజేందర్, వేముల రామకృష్ణ, అనంతయ్య, నందగోపాల్, రాజ్‌కుమార్, మోడీ రాందేవ్లతో పాటు నిరుద్యోగులు పాల్గొన్నారు.