మేడ్చల్, మార్చి11(నమస్తే తెలంగాణ) : గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారనుంది. జాగ ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిరుపేదల సొంతింటి కల సాకారం కానుంది. జాగ ఉండి ఇళ్లు కట్టుకునే స్థోమత లేని వారికి గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ప్రభుత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జిల్లా వ్యాప్తంగా మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 15 వేల మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయనున్నారు. నియోజకవర్గానికి 3 వేల మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని అందించనున్నారు.
అర్హులందరికి గృహలక్ష్మి పథకం వర్తింపు
నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. జాగ ఉన్న నిరుపేద లబ్ధిదారులందరికి గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 15 వేల మంది లబ్ధిదారులను గృహలక్ష్మి పథకానికి ఎంపిక చేస్తాం.
– కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
ఇల్లు కట్టుకుంటామని కలలో కూడా అనుకోలేదు
ఇల్లు కట్టుకుంటామని కలలో కూడ అనుకోలేదు. సీఎం కేసీఆర్ దయతో ఇళ్లు కట్టుకునే అవకాశం వచ్చింది. నేను, నా భర్త కూలీ పని చేసి ముగ్గురు పిల్లలతో బతుకుతున్నాం. పెండ్లి ఈడుకు వచ్చిన బిడ్డ ఉంది. సొంత జాగ ఉన్న కిరాయికి ఉంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం సాయం అందిచడంతో సొంత ఇల్ల కట్టుకుంటాం.
-మేడిపల్లి కృష్ణవేణి, అలియాబాద్
ఇల్లు లేకుండా బతుకుతామనుకున్నాం
ఇల్లు లేకుండానే ఉన్నంత కాలం బతుకుతామని అనుకు న్నాం. కేసీఆర్ సార్ రూపంలో ఇల్లు కట్టుకుంటామన్న నమ్మ కం అచ్చింది. సొంత జాగలో గుడిసే వేసుకుని ఉంటున్నాం. గుడిసె జాగలో ఇల్లు కట్టుకునేందుకు సర్కార్ పైసలు ఇస్తుందని చెప్పారు. కేసీఆర్ దయతో ఇల్లు కట్టుకుంటామన్న ఆశ వచ్చింది.
-కంచుకోట్ల లక్ష్మి, అలియాబాద్
సంతోషంగా ఉంది
గృహలక్ష్మి పథకం ద్వారా సొంతింటి కల నెరవేరడం సంతోషంగా ఉంది. కూలీపని చేసే తనకు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. తనకు ఉన్న వంద గజాల్లో కేసీఆర్ సార్ అందించే పైసలతో ఇల్లు కట్టుకుంటా. సొంత ఇల్లు లేదనే బాధ త్వరలోనే తీరిపోతుంది.
-లలిత, దమ్మాయిగూడ