సిటీబ్యూరో: వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తుగా సమాయత్తం కావాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. మే నెలాఖరు నాటికల్లా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాల్సిన అధికారులు ప్రతిపాదనలు రూపొందించడంలో తాత్సారం చేస్తున్నారు. ఏటా దాదాపు రూ.33 కోట్లతో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ను రూపొందించి పనులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఏరియాల వారీగా 140 బృందాలు, ప్రత్యేక వాహనాలు, స్టాటిక్ లేబర్స్, మినీ మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకు ఐఆర్టీ పనులకు ఇప్పటికే టెండర్లు పిలవాల్సిన అధికారులు జాప్యం చేస్తున్నారు. ఇటీవల కమిషనర్ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని ఆదేశించిన ఇప్పటి వరకు పురోగతి లేకపోవడం ఇంజినీరింగ్ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. కాగా, వర్షాకాల విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధం కావాలి. అయితే గతేడాది ఐఆర్టీ బృందాల ఏర్పాటులో తీవ్ర జాప్యం చేశారు. జూలై వరకు ఎమర్జెన్సీ బృందాలను సిద్దం చేయలేదు.. ఈ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు…పెండింగ్ బకాయిలు రూ. 1500కోట్లు చెల్లిస్తేనే టెండర్లలో పాల్గొంటామని తేల్చి చెప్పడంతో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ టెండర్లు స్పందన లేకపోవడం జాప్యం జరిగింది.
గత అనుభవాలతోనైనా అధికారులు ఈ ఏడాది ముందస్తుగా కార్యాచరణలో ఆదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టర్లు సైతం ఇప్పటి వరకు పెండింగ్ బకాయిల క్లియరెన్స్ చేయలేదని, జూన్ నాటికల్లా రూ.400కోట్ల మేర బకాయిలు చెల్లిస్తారని చెప్పారే తప్ప ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బకాయిలు వస్తేనే జీహెచ్ఎంసీ చేపట్టబోయే పనులకు ఆసక్తికనబరుస్తామని సదరు కాంట్రాక్టర్లు చెబుతుండడంతో ఈ పనుల టెండర్లపై అధికారులు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.