సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఎలక్ట్రిక్ ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే రెడ్కో ఆధ్వర్యంలో గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన ఈ చార్జింగ్ కేంద్రంలో కేవలం అరగంటలో చార్జింగ్ పూర్తికావడం విశేషం. ఇప్పటికే టెస్ట్ రన్లో భాగంగా ఈవీ చార్జింగ్ కేంద్రాల పనితీరు భేష్‌గా ఉందని రుజువైంది. ఈ స్టేషన్లు మరి కొన్ని రోజుల్లో వాహనదారులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ స్టేషన్లలో కార్లను చార్జింగ్ చేసుకోవచ్చు. నగరంలో ఇప్పటికే ఉన్న ప్రైవేట్ చార్జింగ్ కేంద్రాల ధరల కంటే రెడ్కో ఏర్పాటు చేసిన ఈవీ స్టేషన్లలో ధరలు తక్కువగా ఉండనున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐసీ, ఫుడ్ కార్పొరేషన్ల నుంచి సేకరించిన ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టేషన్లలో చార్జింగ్ జరిగే సమయంలో సంబంధిత వాహనదారుల కోసం ఫుడ్ కోర్ట్లు, సేద తీరడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తక్కువ ధరకే చార్జింగ్..
150 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ చార్జింగ్ కేంద్రాల్లో ఒక మిషన్‌కు రెండు వైపుల చార్జింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి రెండు వాహనాలకు చార్జింగ్ ప్రక్రియ కొనసాగితే కార్లు ఫుల్ చార్జింగ్ కావడానికి అదనంగా మరో 15 నిమిషాలు పడుతుంది. ఒకే వాహనం చార్జింగ్ అయితే అరగంటలో ఫుల్ అవుతుంది. ప్రస్తుతం అప్డేట్ వర్షన్ లిథియం అయాన్ బ్యాటరీలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
కార్ల కంపెనీల ఆధారంగా చార్జింగ్
ఒక్కో కంపెనీ వాహనానికి ఫుల్ చార్జింగ్ కావడానికి యూనిట్లలో తేడా ఉంటుంది. నెక్సాన్ కంపెనీ ఈవీ వాహనాలు ఫుల్ చార్జింగ్ కావడానికి 30 యూనిట్స్ అవసరం పడుతుంది. సుమారు 450 కిలో మీటర్ల మైలేజీ ఉంటుంది. ఎంజీ వాహనాలకు 50 యూనిట్లు అవుతుంది. బీఐడీ వాహనాలకు 70 యూనిట్లు అవసరం పడుతుంది. ఇది 500కిలో మీటర్ల వరకు పనిచేస్తుంది. అయితే ఒక్కో యూనిట్‌కు రెడ్కో చార్జింగ్ కేంద్రాలు కేవలం రూ.12 చార్జీ చేస్తాయి. మిగిలిన ప్రైవేట్ కేంద్రాల్లో ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.20 వసూలు చేస్తుండటం గమనార్హం.
తెలంగాణ నం.1..!!తెలంగాణ నం.1..!!దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు పనులు మొదలైనా.. పనులన్నీ చకచకా పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకువస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. అంతేకాదు ఈవీ చార్జింగ్ కేంద్రాల సమాచారం అంతా ఒక్క క్లిక్‌లో అందుబాటులోకి రెడ్కో తీసుకువస్తుంది. ‘టీఎస్ఈవీ’ యాప్‌లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకు దగ్గర లొకేషన్ ఎక్కడ ఉంది? పేమెంట్? తదితర వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వీటిని త్వరలోనే కొత్తగా ఏర్పాటైన 5 జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రెడ్కో స్థలం సేకరించింది.
స్టేషన్లు ఇవే..!!
ఈసేవ వనస్థలిపురం
నాగోల్ ఆర్టీఏ పార్కింగ్
అంబర్పేట్ పీఎస్ సమీపంలో
గచ్చిబౌలీ స్టేడియం ఎదురుగా
దుర్గం చెరువు జీహెచ్ఎంసీ పార్కింగ్
సికింద్రాబాద్ క్లాక్ టవర్
ఓల్డ్ పాస్‌పోర్ట్ ఆఫీస్, సికింద్రాబాద్
శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్
ఐఐటీ పార్కింగ్ దగ్గర టీసీఎస్
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం
హెచ్ఎండీఏ ట్రక్ పార్కింగ్
కాలుష్య నియంత్రణే లక్ష్యం
కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. చార్జింగ్ కేంద్రాల్లో వాహనాల పారింగ్, వాహన యజమానులు సేదతీరేందుకు వసతులు కల్పించేల ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా వీటిని మన రాష్ట్రంలోనే మొదటగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. యూనిట్ ధరలు కూడా తక్కువగా నిర్ణయించాం.
-వై. సతీష్ రెడ్డి, రెడో చైర్మన్