దుండిగల్,నవంబర్ 8: నగల దుకాణానికి కన్నం వేసిన దుండగులు సుమారు.25 లక్షల విలువచేసే వెండి వస్తువులను దొంగిలించారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం…దుండిగల్ మున్సిపాలిటీ పరిధి,బౌరంపేటలోని కీర్తిహోమ్స్లో నివాసముంటున్న మోత్కూరు సోమేశ్వర్.. బౌరంపేట్‌లో సోమేశ్వర జ్యువెల్లర్స్ పేరిట వెండి,బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమేశ్వర్ శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దుకాణం మూసి తాళం వేసి ఇంటికి వెళ్లాడు.
తిరిగి శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో షాపులో పనిచేసే అరుణ్‌కుమార్ వచ్చి తాళంతెరిచి చూడగా షాపులోని ఓ గోడకు రంద్రం కనిపించింది. వెంటనే యజమాని సోమేశ్వర్‌కు సమాచారం అందించాడు. అతను షాపుకు వచ్చి పరిశీలించగా దుకాణంలోని సుమారు 15కిలోల పైచిలుకు వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేసి.. ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటనా స్థలాన్ని మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి సందర్శించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.
వారి పనేనా…?
కాగా గురువారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు సోమేశ్వర జ్యువెల్లర్స్ షెట్టర్ యజమాని ఇంటికి వచ్చి కిరాయిఇల్లు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఇల్లు నచ్చిందని రేపే ఇంట్లో దిగుతామని, ఈ లోగా ఇంటిని శుద్ధి చేసుకుంటామని ఇంటి యజమానిని నమ్మించి అతని వద్ద తాము కిరాయికి ఉండాలనుకున్న గదికి సంబంధించిన తాళాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే రాత్రి పొద్దుపోయేంత వరకు ఇంటిని శుభ్రం చేసినట్లు నటించి ఉదయం నుంచి కనపడకుండా పోయినట్లు తెలుస్తుంది. ఈ దొంగతనం చేసింది వారిద్దరే అయి ఉంటారని భావిస్తున్నారు. ముందు స్తు పథకంలో భాగంగా జ్యువెల్లరీషాప్కు ఆనుకుని ఉన్న గదిని తీసుకున్నట్లు తెలుస్తుంది.