సిటీ బ్యూరో, వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 6(నమస్తే తెలంగాణ): పచ్చని చెట్లను చెరబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, వందల ఎకరాల భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములపై కన్నేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు నడుం బిగించి ముందుకు సాగుతున్నది. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లోని అడవిని చదను చేసింది.
ఆ దుశ్చర్యపై సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టినా రేవంత్‌రెడ్డి సర్కారు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో 150 ఎకరాల భూమిపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసింది. వనమహోత్సవం పేరిట యూనివర్సిటీలోని బొటానికల్ గార్డెన్పైకి అర్ధరాత్రి బుల్డోజర్లను పంపించింది. సోమవారం బొటానికల్ గార్డెన్‌లోనే సీఎం రేవంత్‌రెడ్డి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుతారని ప్రకటించడంతో రాత్రికి రాత్రే పదెకరాల విస్తీర్ణంలోని పెద్ద పెద్ద వృక్షాలను నేలమట్టం చేశారు.
ఏండ్ల తరబడిగా ఏపుగా పెరిగిన చెట్లను నరికేసి చదును చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఒక్క చెట్టును నరకకుండానే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖాళీ స్థలమే దొరకనట్లు చెట్లను నరికి మొక్కలను నాటుతున్నది. ఏండ్ల తరబడిగా ఏపుగా పెరిగిన చెట్లను చెరిపేసి వాటి స్థానంలో మొక్కలను నాటడమేంటని పర్యావరణవేత్తలు, మేధావులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వన మహోత్సవం పేరిట భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి వరుస కట్టిన బుల్డోజర్లు
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో శనివారం అర్ధరాత్రి బుల్డోజర్లతో బోటానికల్ గార్డెన్‌లోని విలువైన వృక్ష సంపదను నేలమట్టం చేశారు. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో సుబాబుల్, యూకలిప్టస్‌తో పాటు సహాజ సిద్ధంగా పెరిగిన విలువైన వేప, చింత, తుమ్మ, సీతాఫలం, పలు ఔషధ మొక్కలను వేళ్లతో సహా పెకిలించి వేశారు. విషయం తెలిసిన వర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భారీగా మోహరించారు.
వ్యవసాయ వర్సిటీలో చెట్లను నరికేసి భూములను అన్యాక్రాంతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డి వన మహోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. చెట్లను నరికేయడానికి అన్ని అనుమతులు తీసుకుంటే రాత్రిళ్లు భారీ యంత్రాలను యూనివర్సిటీలోకి ఎందుకు తీసుకొచ్చారని నిలదీశారు. దీంతో పనులు నిలిపివేశారు. తాము వనమహోత్సవానికి వ్యతిరేకం కాదని, బొటానికల్ గార్డెన్లో విలువైన చెట్లను తొలగించకుండా ఖాళీ స్థలాల్లో మొకలను నాటాలని డిమాండ్ చేశారు. అందుకు ఒప్పుకుంటేనే సోమవారం సీఎం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనిస్తామని స్పష్టంచేశారు.
విద్యార్థులను బెదిరించారా?
యూనివర్సిటీలోని బొటానికల్ గార్డెన్లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏండ్ల తరబడిగా ఉన్న విలువైన వృక్ష సంపదను నాశనం చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం వనమహోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కానీ… ఆదివారం ఉదయం మాత్రం వీసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటడాన్ని సమర్థించారు. వనమహోత్సవానికి వస్తున్న సీఎంకు స్వాగతం పలుకుతామని తెలిపారు.
రాత్రి వ్యతిరేకంగా మాట్లాడి తెల్లారేసరికి మాట మార్చడం వెనుక యూనివర్సిటీ పెద్దల హస్తం ఉందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను బెదిరింపులకు గురిచేసి.. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకుంటే చదువుపై ప్రభావం చూపిస్తామని వేధించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంచ గచ్చిబౌలి ఘటనలాగా ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయంతో విద్యార్థులను మ్యానేజ్ చేశారని ఆరోపిస్తున్నారు.
అనుమతులుంటే… సెలవు రోజులే ఎందుకు?
అగ్రికల్చర్ యూనివర్సిటీలోని బొటానికల్ గార్డెన్లో చెట్లను నరికేసేందుకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జీహెచ్ఎంసీ నుంచి నెల రోజుల కిందట అనుమతులు తీసుకున్నామని వీసీ జానయ్య చెబుతున్నారు. అన్ని అనుమతులున్నాక ఆదివారం సెలవు రోజు ముందు శనివారం అర్ధరాత్రి చెట్లపైకి బుల్డోజర్లను పంపాల్సిన అవసరమేముందని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కంచ గచ్చిబౌలి భూముల్లో కూడా వరుసగా 3 రోజులు సెలవులు రావడాన్ని చూసుకుని విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో చెట్లను నరికేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నెలరోజులకు ముందే అనుమతి తీసుకుంటే సీఎం వనమహోత్సవం పేరిట మొక్కలు నాటనున్న ముందు రోజు దాకా ఎందుకు చెట్లను నరికేయలేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
150 ఎకరాల్లో యూకలిప్టస్, సుబాబుల్ మొక్కలే ఉన్నాయా?
బొటానికల్ గార్డెన్ చెట్ల నరికివేతపై యూనివర్సిటీ వీసీ జానయ్య ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వర్సిటీ పరిధిలోని 150 ఎకరాల్లోని నిరుపయోగమైన యూకలిప్టస్, సుబాబుల్ మొక్కలను తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 15 ఎకరాల్లో చదును చేసి విలువైన, ఔషధ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కానీ.. 15 ఎకరాల విస్తీర్ణంలో కేవలం యూకలిప్టస్, సుబాబుల్ మొక్కలే ఎలా ఉంటాయని పర్యావరణ, వృక్ష శాస్త్ర నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
వాటిని ప్రత్యేక నాటి, సాగు చేస్తేనే అలా ఉండేందుకు సాధ్యం అవుతుందని అంటున్నారు. కానీ.. బొటానికల్ గార్డెన్ పరిధిలో అలాంటి పనులు చేయలేదని తెలుస్తున్నది. యూకలిప్టస్, సుబాబుల్‌తో పాటు అత్యధికంగా ఆక్సిజన్ అందించే పొదలు, గుల్మాలు, ఔషధ మొక్కలు, ఇతర చెట్లు కూడా ఉంటాయని చెబుతున్నారు. యూకలిప్టస్, సుబాబుల్ పేరిట విలువైన వృక్ష సంపదను నాశనం చేయడం సరికాదని సూచిస్తున్నారు. వన మహోత్సవం పేరిట మొక్కలు నాటాలనుకుంటే నగరం చుట్టూ వేలాది ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయని
చెబుతున్నారు.