సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా అన్ని పోలింగ్ స్టేషన్లను సీసీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సోమవారం లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో శాసనసభ ఉప ఎన్నిక కూడా జరగనున్నది.
ఈ ఎన్నికలకు సంబంధించి మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 4,496 పోలింగ్ లొకేషన్లు, 7,236 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు కమిషనర్లు తెలిపారు. ఇందులో భాగంగా మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు 20వేల మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో దాదాపు 4500 మంది కేంద్ర బలగాలు, 6000 మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
సున్నిత, అతి సున్నితమైన పోలింగ్ స్టేషన్లు, లొకేషన్లు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ స్టేషన్లలోకి సెల్ఫోన్లను అనుమతించరని, నగర కమిషనరేట్ పరిధిలో ఈ నెల 11 సాయంత్రం 6 నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయడం జరుగుతుందని సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. మిగిలిన రెండు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఎన్నికల ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ తరుణ్‌జోషి పర్యవేక్షించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలించారు. రాచకొండ పరిధిలోని సైనిక్‌పురి భవన్స్ కళాశాల, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, గుర్రంగూడలోని స్పూర్తి కళాశాల, మేడ్చల్‌లోని హోలిమేరీ కళాశాల.. తదితర పోలింగ్ లొకేషన్లలో ఎన్నికల ఏర్పాట్లను సీపీ తరుణ్‌జోషి పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా వ్యవస్థకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ అధికారులు కలవకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీపీతో పాటు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీలు, ఇతర అధికారులు ఉన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోస్టులు పెట్టినా, రెచ్చగొట్టే, ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్లు హెచ్చరించారు.