సిటీబ్యూరో/మూసాపేట, ఆగటస్టు 22 (నమస్తే తెలంగాణ): పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఓటీటీకి అలవాటు పడ్డాడు. క్రైం వెబ్ సిరీస్‌లను చూడడమే పనిగా పెట్టుకున్నాడు. అందులోని సన్నివేశాలను అనుకరిస్తూ ఓ హత్యకు పన్నాగం పన్నాడు. పక్కింట్లో ఉంటున్న చిన్నారిని అత్యంత దారుణంగా 18 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఇందుకోసం హత్య ప్రణాళికను ముందుగానే ఓ పేపర్‌పై రాసుకొని ఉండడం అందరినీ విస్మయపరిచేలా చేసింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కృష్ణ, రేణుక దంపతులు తమ కూతురు సహస్రాణి(10), కుమారుడు సద్విన్(8)తో కలిసి గత రెండు సంవత్సరాలుగా కూకట్పల్లి, సంగీత్‌నగర్‌లోని ఒక అపార్ట్మెంట్ పెంట్హస్లో నివాసం ఉంటున్నారు.
అదే అపార్ట్‌మెంట్‌కు ఆనుకుని ఉన్న మరో అపార్ట్మెంట్ 4వ అంతస్తులో 10వ తరగతి చదువుతున్న బాలుడు తన తల్లి, ఇద్దరు సోదరిలతో కలిసి నివాసం ఉంటున్నారు. బాలుడి తండ్రి కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో తల్లి స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే సహస్రాణి తమ్ముడుతో స్నేహం చేసిన 10వ తరగతి బాలుడు తరచూ ఆడుకునేందుకు వారి ఇంటికి వెళ్లేవాడు. అయితే ఈనెల 18న సహస్రాణి తల్లిదండ్రులు ఉద్యోగ రీత్య బయటకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని భావించిన బాలుడు తన భవనం 3వ అంతస్తు నుంచి సహస్రాణి నివాసం ఉండే భవనంలోకి దూకాడు.
అనంతరం బాలిక ఇంట్లోకి చొరబడి దొంగతనానికి యత్నించాడు. ఇది గమనించిన చిన్నారి, బాలుడిని చూసి కేకలు వేయడంతో పాటు దొంగతనానికి వచ్చిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించింది. దీంతో విషయం బయట పడుతుందని భావించిన బాలుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో సహస్రాణిని విచక్షణా రహితంగా పొడిచి హత్యచేశాడు. అంతే కాకుండా బాలిక చనిపోయిందో లేదో అనే అనుమానంతో మరోసారి బాలిక గొంతుపై పలు మార్ల కత్తితో పొడిచాడు.
ఘటన జరిగిన అపార్ట్‌మెంట్‌తో పాటు దాని చుట్టుపక్కల కూడా ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో చిన్నారి హత్యకేసుకు సంబంధించిన దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. అయితే ఘటన జరిగిన భవనంలోకి చొబడేందుకు ఉన్న అవకాశాలపై పోలీసులు అన్వేషన మొదలు పెట్టారు. దీంతో ఘటన జరిగిన భవనంలోకి దాని వెనకవైపు ఉన్న అపార్ట్మెంట్ నుంచి వచ్చే అవకాశాలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు హత్యజరిగిన భవనం వెనకాల ఉన్న అపార్ట్మెంట్ వాసులను పోలీసులు విచారించారు.
ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను విచారించగా హత్య జరిగిన రోజు తన గది పక్కనే సుమారు అరగంటకు పైగా ఒక బాలుడి దాగున్నట్లు తెలిపాడు. సదరు బాలుడు అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటాడని తెలుసుకున్న పోలీసులు వెంటనే బాలుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. మొదట పోలీసులను తప్పుదారి పట్టించిన బాలుడు ఆ తరువాత తమదైన శైలిలో ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అతడి కుటుంబ సభ్యుల సమక్షంలో బాలుడి ఇంట్లో సోదాలు జరిపారు.
ఈ తనిఖీలో హత్యకు వినియోగించిన కత్తి, రక్తపు మరకలతో కూడిన దుస్తువులు, దొంగతనం ఎలా చేసి, తప్పించుకోవాలో….తదితర అంశాలను ఒక పేపర్లో స్క్రిప్ట్ రాసుకుని, పథకం ప్రకారం బాలికను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం చిన్నారి హత్య కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు పోలీసులు దృవీకరించలేదు.
బాలికను హత్యచేసిన బాలుడికి తరచూ నేర సన్నివేశాలు చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే హత్య చేయడానికి రెండు రోజుల ముందు ఓటీటీలో ఒక క్రైమ్ వెబ్‌సిరీస్ చూసి సహస్రాణి ఇంటిలో దొంగతనానికి స్కెచ్ వేశాడు. అంతేకాకుండా వెబ్ సిరీస్ ఆధారంగా దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలి, ఆధారాలు లభించకుండా ఎలా జాగ్రత పడాలి తదితర అంశాలను ఒక పేపర్‌పై స్క్రిప్ట్ రాసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.