బంజారాహిల్స్, సెప్టెంబర్ 3: బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన పెద్దమ్మ ఆలయం వ్యవహారంలోని 12 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని హెచ్ఎండీఏకి అప్పగించారు. ఇప్పటిదాకా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఉన్న 12 ఎకరాల స్థలాన్ని తాజాగా హెచ్ఎండీఏకు అప్పగించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఏసీబీ కార్యాలయం, ఎమ్మెల్యే కాలనీకి మధ్యన షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 102/1, టీఎస్ నంబర్ 1/పి, 3/పీ, బ్లాక్-జే, వార్డు 12లో 12 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నది.
దీనిని ఆనుకుని సుమారు 16 ఎకరాల ప్రైవేటు స్థలంపై కోర్టుల్లో అనేక రకాలైన కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. నాలుగు నెలల కిందట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించడంతో పాటు పదిహేనురోజులు శ్రమించి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలంలోకి చొచ్చుకు వచ్చిన కొంత మంది వ్యక్తులు చేసిన ఆక్రమణలను కూల్చేశారు. ఈ స్థలాన్ని హెచ్ఎండీఏకు అప్పగించి థీమ్ పార్కుగా అభివృద్ది చేస్తామని, లేదంటే ప్రజలకు ఉపయోగపడే అవసరాలకు వినియోగిస్తామంటూ నాలుగు నెలల కిందట స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
అయితే రెండు నెలల కిందట 12 ఎకరాల స్థలం లోపలి భాగంలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయాన్ని కూల్చేసిన రెవెన్యూ అధికారులు అక్కడి విగ్రహాన్ని తరలించారు. దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు. రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉన్నది. స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, 12 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ స్థలంలో వివిధ జాతులకు చెందిన వృక్షాలున్నాయని, పచ్చదనంతో అడవిని తలపించే ఈ స్థలాన్ని థీమ్ పార్కులాగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్థలాన్ని హెచ్ఎండీఏకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. ఈ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారా? లేక ప్రజల అవసరాలకు వినియోగిస్తారా? అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. కంచె గచ్చిబౌలిలో అడవిని ధ్వంసం చేసిన ప్రభుత్వ తీరుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న నేపథ్యంలో అక్కడ ధ్వంసమైన అడవికి ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్యే కాలనీలోని స్థలాన్ని ప్రభుత్వం చూపించాలనే కోణంలో సైతం ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.