సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తప్పిపోయిన, చోరీకి గురైన 1061సెల్ఫోన్లను సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)పోలీసులు రికవరీ చేశారు. ఈ సెల్ఫోన్ల విలువ సుమారు 3.20కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి, అదనపు డీసీపీ రామ్‌కుమార్‌తో కలిసి సంబంధిత యజమానులకు ఫోన్లను అందచేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. గడిచిన 45రోజుల్లో తప్పిపోయిన, చోరీకి గురైన రూ.3.20 కోట్ల విలువ చేసే 1061సెల్ఫోన్లను సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)పోర్టల్ ద్వారా కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లకు చెందిన సీసీఎస్ బృందాలు రికవరీ చేసినట్లు తెలిపారు.
మాదాపూర్ సీసీఎస్ పోలీసులు 240 సెల్ఫోన్లను, బాలానగర్ సీసీఎస్-188, మేడ్చల్ సీసీఎస్-195, రాజేంద్రనగర్ సీసీఎస్-233, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు 205 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు డీసీపీ వివరించారు. ప్రస్తుత రోజుల్లో సెల్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి శరీరంలో ఒక భాగంగా మారిపోయిందని, అందులో వ్యక్తిగత సమాచారంతో పాటు కీలకమైన సమాచారం, ఆర్థికపరమైన వివరాలు వంటి అంశాలు నిక్షిప్తమై ఉండడటం వల్ల సెల్ఫోన్లు నేరస్తుల చేతికి చిక్కితే అనర్థాలు కూడా జరిగే ప్రమా దం లేకపోలేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సెల్‌ఫోన్ మిస్సింగ్‌కు సంబంధించిన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి చేధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఏసీపీ నాగేశ్వర్రావు, మాదాపూర్, బాలానగర్, మేడ్చల్, రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రవికుమార్, దాలినాయుడు, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.