సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. నాంపల్లి, ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎక్సైజ్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్‌తో కలిసి కేసు పూర్వపరాలను వెల్లడించారు. ఒడిశా మలాన్గిరి జిల్లాకు చెందిన రాం బాబు, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన కట్ల వివేక్‌రెడ్డితో కలిసి కొంత కాలంగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలోని ఇతర గంజాయి వ్యాపారులకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఒడిశా నుంచి రాంబాబు, వివేక్‌రెడ్డి మేడిపల్లి ప్రాంతానికి చెందిన దగ్గుమల్లి మధుకిరణ్తో కలిసి వంద కిలోలకు పైగా గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయిని ప్రైవేటు వాహనంలో న గరానికి తరలించి, శివారు ప్రాంతమైన మల్లాపూర్‌లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలో ఉన్న ఒక పాడుపడిన గోదాంలో నిల్వ చేశారు.
ఈ గంజాయిని నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని గంజాయి వ్యాపారులకు సరఫరా చేసేందుకు యత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీటీఎఫ్, ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి మల్లాపూర్, హెచ్‌సీఎల్ కాలనీలోని గోదాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాంబాబు, వివేక్‌రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి, స్థానికంగా ఉన్న గోదాంలో నిలువ చేసినట్లు అంగీకరించారు. గోదాంలో తనిఖీలు చేయగా పెద్ద ఎత్తున గంజాయి బ్యాగులు బయట పడ్డాయి. దీంతో నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.53లక్షల విలువచేసే 106 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మధుకిరణ్ కోసం గాలిస్తున్నట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్న మలాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, ఏఈఎస్ ముకుందరెడ్డి, ఉప్పల్ ఎస్హెచ్ఒ ఓంకార్, డీటీఎఫ్ సీఐ భరత్ భూషన్, ఎస్సైలు నరేశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బృందాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ అభినందించారు.