Bandlaguda | బండ్లగూడ, మార్చి 19 : అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఉంది హెచ్ఆర్డిసిఎల్ సంస్థ పనులు. రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ఏడాదిగా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినప్పటికీ నేటికీ రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ నుంచి బండ్లగూడ, దర్గా ఖలీజ్ ఖాన్ నుంచి కిస్మత్పూర్, కిస్మత్పూర్ నుంచి ఎక్సైజ్ అకాడమీ వరకు వాహనదారులు ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు.
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లు విస్తరణ చేసేందుకు అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా నుంచి కిస్మత్పూర్ వరకు, కిస్మత్పూర్ నుంచి దర్గా ఖలీస్ ఖాన్, ఎక్సైజ్ అకాడమీ నుంచి కిస్మత్పూర్ వరకు మూడు రోడ్లను 100 ఫీట్ల రోడ్డు వేసేందుకు ఏడాది క్రితమే అధికారులు ప్రణాళికలను రూపొందించడంతోపాటు టెండర్లను సైతం పూర్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రోడ్డుకిరువైపులా ఎంతవరకు విస్తరించేది మార్కులు సైతం చేశారు. నాటి నుంచి నేటి వరకు అధికారులు వస్తున్నారు రోడ్లను పరిశీలించి వెళ్తున్నారు తప్ప రోడ్డు పనులను ప్రారంభించడం లేదు. రోడ్డు విస్తరణ జరిగితే తనకు ఎంతో మేలు జరుగుతుందన్న ప్రజలకు నిరాశే మిగిలుస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోడ్డు విస్తరణ పనులు మూలన పడ్డాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల హెచ్ఆర్డిసిఎల్ అధికారులు వచ్చి రోడ్లను పరిశీలించి వెళ్లారు. ప్రజలను మభ్యపెట్టెందుకే అధికారులు అదిగో ఇదిగో అంటూ వచ్చి చూస్తున్నారు తప్ప పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం అధికారులు ఇటీవల వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర ఇతర అధికారులతో కలిసి మరల పరిశీలించి వెళ్లారు. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని నమస్తే తెలంగాణ ప్రతినిధి డిప్యూటీ ఇంజనీర్‌ను వివరణ కోరగా టెండర్ పనులు పూర్తయినట్లు అగ్రిమెంట్ కావడమే తరువాత రోడ్డు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణ కోసం ల్యాండ్ ఆక్విజేషన్ చేయవలసిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా ఉండడంతో రోడ్డు పనుల నిర్మాణంలో ఆలస్యం జరుగుతుంది. రోడ్డు విస్తరణ కోసం ఏడాది క్రితమే మార్కింగులు చేయగా నేటి వరకు ల్యాండ్ సేకరించకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కనపడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్డు పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వెంట వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.