కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 6 : కేపీహెచ్‌బీ కాలనీలో గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన స్థలంలో వంద పడకల వైద్యశాల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కూకట్పల్లి జనసేనా ఇన్చార్జీ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ డిమాండ్ చేశారు. గురువారం జనసేనా పార్టీ ఆధ్వర్యంలో వంద పడకల ప్రభుత్వ వైద్యశాలను వెంటనే నిర్మించాలని కోరుతూ జనసైనికుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన కేపీహెచ్‌బీ కాలనీలో ప్రభుత్వ వైద్యశాల కోసం కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో 1.72 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్థలంలో వంద పడకల వైద్యశాలను నిర్మించేందుకు గత ప్రభుత్వం 2023లో శంకుస్థాపన చేసిందని, తొమ్మిది నేలలో పనులు పూర్తిచేస్తామని అప్పటి ఆరోగ్యమంత్రి చేప్పారని, నేటికి పనులు ప్రారంభం కాకపోవడం బాధకరమన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ పరసర ప్రాంతాలలో సూమారు ఐదు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, పేదవారికి రోగం వస్తే..పైవేట్ వైద్యశాలకు వెళ్లి జేబులు గుల్లచేసుకోవాల్సి వస్తుందన్నారు.కూలినాలీ పనులు, చిరువ్యాపారులు, కార్మికులు, రిక్షా, జీహెచ్ఎంసీ కార్మికలు, వాచ్మెన్లుగా పనిచేస్తున్నవారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యేడాది అయినా… వైద్యశాల నిర్మాణం గూర్చి ఆలోచన చేయడం లేదన్నారు. మరోవైపు వైద్యశాల స్థలాన్ని అమ్మకానికి పెట్టినా…. ఎవరైనా అక్రమించిన పోరాటం చేస్తామన్నారు. కాలనీలో ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనుల నిర్లక్ష్యంపై జనసేనా అధినేతను కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. ప్రభుత్వాధికారులు స్పందించి…వెంటనే వైద్యశాల నిర్మాణ పనులను ప్రారంభించాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేనా నేతలు, వీర మహిళలు పాల్గొన్నారు.