అమీర్‌పేట్, మే 19 : పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మన దేశంలో ఏటా 10 లక్ష మరణాలు సంభవిస్తున్నాయని గాంధీ దవాఖాన రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ రావూస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ నాగేశ్వరావు పేర్కొన్నారు. పొగాకు వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా శుక్రవారం డాక్టర్ నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బీకేగూడ శ్రీశ్రీనివాసా సమాజ సేవా సమితి వేదిక సమీపంలో పొగాకు వాడకం వల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరిస్తున్న బ్యానర్లను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ దంతవైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శ్రీనాథ్‌రెడ్డి, ఫౌండేషన్ కోఆర్డినేటర్ కుసుమ భోగరాజు, ప్రముఖ ఇంజినీర్, సామాజికవేత్త టి.వియ్‌కుమార్, రిటైర్డ్ అధికారి డి.పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓ.నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. పొగాకుతో వచ్చే వ్యాధులు, ఇతరుల ద్వారా పొగ బారిన పడటం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
సామాన్యులకు దంత సంబంధ విషయాల్లో తన యూట్యూబ్ చానెల్ ద్వారా 1008 వీడియోలను అప్లోడ్ చేసినందుకు, డాక్టర్ ఓ.ఎన్.రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఓ.నాగేశ్వరావుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో చోటు లభించింది. ఈ నెల 21న భాషా సాంస్కృతిక శాఖ, ఆదర్ష ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో ప్రకటన ఉంటుందని ఆదర్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుసుమ భోగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.