హైదరాబాద్ : చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో యవన్ అలియాస్ అఖిల్ (20) అనే యువకుడి హత్య కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెల 7న యవన్ దారుణ హత్యకు గురయ్యాడు. నలుగురు వ్యక్తులు అతడిని కత్తులతో పొడిచి చంపారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
హత్య విషయం తెలుసుకున్న యువకుడి బంధువులు, మృతుడి తండ్రి శ్రీనివాస్, తల్లి అన్నపూర్ణ, ఇతర కుటుంబ సభ్యులు మేడిబావిలోని యువతి నివాసం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు.
అల్వాల్‌కు చెందిన అఖిల్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సీతాఫల్మండిలోనే ఉన్న అతని కుటుంబసభ్యులు రెండేండ్ల క్రితం అల్వాల్‌కు మారారు. అఖిల్ మేడిబావికి చెందిన ఓ యువతిని ప్రేమించినట్టు తెలుస్తున్నది. తరచుగా అల్వాల్ నుంచి సీతాఫల్‌మండికి చెందిన స్నేహితుడి ఇంటికి వచ్చేవాడు. గురువారం రాత్రి అలాగే వచ్చి స్నేహితుడి నివాసం వద్ద ఉండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దారుణంగా కత్తులతో పొడిచి పారిపోయారు.
వెంటనే గాంధీ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యవన్ కుటుంబసభ్యులు రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువతి ఇంటి ముందు కూడా మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.