రూ.116 కోట్ల వ్యయంతో నిర్మాణం
హిమాయత్‌సాగర్ నుంచి లంగర్‌హౌస్ మధ్య నిర్మాణాలు..
బుద్వేల్ ఐటీ పార్కులోనే రెండు..
సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో అత్యంత మెరుగైన రోడ్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మూసీకి ఉపనదిగా ఉన్న ఈసీపై ఒకేసారి నాలుగు వంతెనలు నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేసింది. హిమాయత్‌సాగర్ నుంచి లంగర్‌హౌస్ వరకు ఉన్న ఈసీపై ప్రస్తుతం ఒక బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఈ నదికి ఇరువైపులా నివాస ప్రాంతాలు ఏర్పాటు కావడంతో ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో స్థానికుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం కొత్త వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.116 కోట్లను వెచ్చించనున్నది.
7 కిలోమీటర్ల పరిధిలోనే..
హిమాయత్‌సాగర్ జలాశయం కింది నుంచి ఈసీ నది పారుతూ కిస్మత్పూర్, బుద్వేల్, అత్తాపూర్, సన్సిటీల మీదుగా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద మూసీలో కలుస్తుంది. ఈ నది పరిధి కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే. ఈసీ నదిని దాటేందుకు కిస్మత్పూర్ వద్ద నాలుగు ఏండ్ల క్రితం హెచ్ఎండీఏ వంతెనను నిర్మించగా.. బాపుఘాట్ వద్ద మరో బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఈ వంతెనలపై రద్దీ పెరగడంతో మరో నాలుగు చోట్ల హైలెవల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు.
బుద్వేల్ ఐటీ పార్కుకు ఊతం..
శంషాబాద్ విమానాశ్రయం-మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ల మధ్య ఔటర్ రింగురోడ్డును ఆనుకొని బుద్వేల్ ఉండడంతో ఐటీ పార్కుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించిన ప్రభుత్వం 350 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ ప్రాంతంలో ఈసీ ప్రవహిస్తుండటంతో నదికి ఇరువైపులా ఐటీ కారిడార్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఇక్కడ రెండు కొత్త వంతెనలను నిర్మిస్తున్నారు. తద్వారా ఐటీ కారిడార్ అభివృద్ధికి ఊతం ఇచ్చేలా ఈ వంతెనలు ఉంటాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నాయి.
ఎక్కడెక్కడంటే..
సన్‌సిటీ-చింతల్మెట్ ప్రాంతాలను కలుపుతూ పవర్కారిడార్ కింద హై లెవల్ బ్రిడ్జి.. వ్యయం రూ.32 కోట్లు రాజేంద్రనగర్ ఇన్నర్ రింగురోడ్డు నుంచి కిస్మత్పూర్ రోడ్డును కలుపుతూ బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో హై లెవల్ బ్రిడ్జి.. నిర్మాణ ఖర్చు రూ.32 కోట్లు బుద్వేల్ ఐటీ పార్కులను కలుపుతూ రెండు వంతెనలు.. సమాంతరంగా రోడ్ల నిర్మాణం .. వ్యయం రూ.20 కోట్లు