మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : ‘అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే చేయాల్సిందల్లా హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్’ అంటూ.. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉద్యోగార్థులకు ఉద్బోధించారు. సమయపాలన పాటిస్తూ.. ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. గుండ్లపోచంపల్లిలోని వీ కన్వెన్షన్‌లో శుక్రవారం బాలానగర్ డీసీసీ సందీప్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు ఇస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన సీపీ స్టీఫెన్ రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల తీరు అకడమిక్ పరీక్షలకు భిన్నంగా ఉంటుందని, తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను చదవాలని సూచించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు సరైన దిశానిర్దేశం ఇవ్వాలని, 20 నుంచి 25 మంది పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని నిర్వాహకులను ఆదేశించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగం సాధించాలని, తద్వారా కుటుంబం, సమాజంలో గుర్తింపు పొందాలని అభ్యర్థులకు సూచించారు. పోలీసు ఉద్యోగాల పరీక్ష పారదర్శకంగా ఉంటుందని, ఎవరినీ నమ్మి డబ్బులు ఇవ్వొద్దని, కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని చెప్పారు. అనంతరం డీసీపీ సందీప్ మాట్లాడుతూ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల శిక్షణకు 1131 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి కండ్లకోయలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు రూ.4వేల విలువ చేసే మెటీరియల్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు.
శిక్షణ ఉపయోగపడింది
పేదరికంలో ఉన్న నేను శిక్షణ పొందడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడింది. కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. నేను ఉద్యోగం సాధించేందుకు తోడ్పాటునందించిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-శైలేశ్వర్, కానిస్టేబుల్, మేడ్చల్
చైతన్యం నింపింది..
కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుంది. మా ఇంట్లో కోచింగ్‌కు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నిరుత్సాహానికి గురైనప్పుడు పోలీస్ శాఖ ఇచ్చిన ఉచిత శిక్షణ నాలో చైతన్యం నింపింది. వినియోగించుకొని, కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా.
-దీప, కానిస్టేబుల్, పేట్‌బషీరాబాద్
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా..
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు పోలీస్ శాఖ ఇచ్చిన శిక్షణ ఎంతగానో ఉపయోగపడింది. సరైన మార్గదర్శనం లభించడంతో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. నమ్మకంతో ముందుకెళితే..ఉద్యోగం తప్పకుండా వస్తుంది.
-పుష్ప, కానిస్టేబుల్, మేడ్చల్