త్వరలో బస్తీలో 282 డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం
పైసా ఖర్చు లేకుండా లబ్ధిదారులకు అందజేత
ఆనందంలో లబ్ధిదారులు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 24: పేదలకు సొంతగూడు కల్పించే దిశగా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ప్రభుత్వం పేదలకు గూడు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చేదోడువాదోడుగా నిలుస్తుందన్నారు. బోర్డు పరిధిలోని రెండో వార్డు రసూల్‌పురా నారాయణ జోపిడి సంఘం బస్తీలో గురువారం నూతనంగా నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు సికింద్రాబాద్ ఆర్డీవో వసంతలక్ష్మి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. నారాయణ జోపిడి సంఘం బస్తీలో త్వరలోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సుమారు రూ.20 కోట్లకు పైగా నిధులతో దాదాపు 282 నివాసాలను నిర్మించనున్నామని పేర్కొన్నారు.
ఇండ్ల నిర్మాణానికి సంబందించి లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లను సైతం అందజేయడం జరుగుతుందన్నారు. ఒక్క పైసా ఖర్చులేకుండా పేద ప్రజలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కొంత ఆలస్యమైనా నారాయణ జోపిడి సంఘం బస్తీ వాసులకు సొంతింటి కల నెరవేరుతున్నందుకు బస్తీ వాసులతో పాటు తనకు కూడా ఎంతో సంతోషంగా ఉందని సాయన్న అన్నారు.కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, శ్యాంకుమార్, లోక్నాధ్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, డి. శ్రీనివాస్, కుమార్, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.