యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ మైదానంలో.. ఫిబ్రవరి 17న
ఐదువేల మంది భక్తులు హాజరు
120 అడుగుల భారీ వేదిక
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్
బంజారాహిల్స్, ఫిబ్రవరి 11: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్ మైదానంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కల్యాణ మహోత్సవం కోసం ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు నేతృత్వంలో సుమారు 120 అడుగుల వెడల్పుతో భారీ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టీటీడీకి చెందిన వేద పండితుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17న సాయంత్రం 5 గంటల నుంచి ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారని, కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో పాటు సుమారు ఐదువేల మంది భక్తులు హాజరుకానున్నారని తెలిపారు. భక్తులకు టీటీడీ నుంచి ప్రసాదాలు తెప్పించి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, రాజ్ కుమార్ పటేల్, వనం సంగీతా యాదవ్ పాల్గొన్నారు.