ఇష్టారాజ్యంగా ఇప్పటికీ 120 సార్లు రాజ్యాంగంలో మార్పులు
పాలకులు మారినప్పుడల్లా పలుమార్లు సవరణలు..
ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 19: ‘రాజ్యాంగంలో మార్పు అనేది ప్రస్తుతం, దేశ ప్రయోజనాలకు ఎంతో అవసరం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. రాజ్యాంగాన్ని పునర్లిఖిస్తేనే దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది’ అని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.దశరథరామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను తమ పార్టీ పూర్తిగా సమర్ధిస్తుందని ఆయన అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆ పార్టీ ప్రతినిధి అళహరి వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఇటీవల ‘రాజ్యాంగాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఉంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో యావత్ భారతంలో విస్తృతమైన చర్చకు దారి తీసిందన్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రాజ్యాం గం గురించి మాట్లాడానికి సాహసించలేదన్నారు. కాని, దానిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సుమారు 72 యేండ్లుగా రాజ్యాంగం అమలులో ఉందని, దాని పనితీరును ప్రతి 15 ఏండ్లకోసారి ఒకసారి సమీక్షించి సముచిత నిర్ణయాలు తీసుకోవాలని అందు లో రాయబడి ఉందన్నారు. దళిత బాంధవుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగంపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాజ్యాంగం అంటే తెలియని వారు కూడా సీఎం చేసిన ప్రకటనల ప్రకంపనలతో ఆలోచించడం మొదలు పెట్టారన్నారు. ఒక కొత్త ఆలోచనకు తెరలేపిన ముఖ్యమంత్రి ప్రకటనను తమ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నదని అన్నారు. అవసరమైతే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి, తిరగరాయాలని చెప్పి న అంబేద్కర్ మాటలను ఆయన గుర్తు చేస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇప్పుడు లేదని, సుమారు 120 సార్లు రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు సవరించారన్నారు. దళితులందరికీ ఈ దేశ సంపదలో సమాన వాటా రావాలంటే రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు.