మంత్రి కేటీఆరకు ఓ మహిళ ట్వీట్
తనను ఆదుకోవాలని వేడుకోలు
తక్షణమే స్పందించిన మంత్రి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 ( నమస్తే తెలంగాణ ):ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. నమ్ముకున్న వ్యక్తి కోసం అమ్మానాన్నలను కాదని అతడితో వచ్చేసింది. ఇద్దరు పిల్లలు. జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో కరోనా రక్కసి ఆమె భర్తను బలితీసుకున్నది. దీంతో ఏం చెయ్యాలో తెలియక తనని ఆదుకుంటారని పుట్టిల్లు, మెట్టింటి వైపు ఆశగా చూసింది. కానీ ప్రేమ వివాహం కారణంగా వాళ్లు దగ్గరికి రానీయలేదు. దిక్కుతోచని స్థితిలో ఆమె ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌ను ఆశ్రయించి.. భరోసా పొందింది.
వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ పరిధిలోని తుకారంగేట్ జోగినగర్కు చెందిన అనీషా ప్రేమ వివాహం చేసుకున్నది. ఆమె భర్త ఇటీవల కొవిడ్‌తో మరణించాడు. ఆమెకు ఐదు, రెండేండ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. భర్త చనిపోయిన తర్వాత ఆమెను బంధువులు ఎవరూ దగ్గరకు రానివ్వలేదు. కనీసం సాయం కూడా చేయలేదు. దీంతో ఆమె కనీసం అద్దె కూడా చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.
పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.. మీరే సాయం చేయండి..!
“నిన్నటి నుంచి పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.” మీరే ఏమైనా సహాయం చేయాలని ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను అభ్యర్థించింది. అనీషా ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అనీషా ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. వీలైనంత త్వరగా ఆ కుటుంబానికి సాయం చేయాలని ఆదేశించారు. ఆకలితో అలమటిస్తున్న ఆ ఇద్దరు పిల్లలకు అంగన్ వాడీ టీచర్ తన ఇంట్లోనే భోజనం వండి తీసుకెళ్లి వడ్డించింది. అనీషా కుటుంబానికి అండగా ఉంటామని అధికారులు భరోసానిచ్చారు. అంగన్వాడీల కృషిని మంత్రి కేటీఆర్ అభినందిస్తూ మళ్లీ ట్వీట్ చేశారు.