సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : షోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జఠిలంగా మారుతున్నది. కొత్త వాహనం కొనుగోలు చేద్దామనుకున్న వారికి సాంకేతిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన వాహనాలకు సంబంధించిన ఆర్సీలు అందడంలోనూ జాప్యం అవుతున్నదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరి పేర్లపై రెండు వాహనాలు ఉన్నప్పటికీ ఆ డేటా షోరూంల సర్వర్లో కనిపించడం లేదని చెబుతున్నారు. వారి వివరాలు నమోదు చేసి.. కొన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిసింది. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ పునః పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
చాలా వరకు సర్వర్ డౌన్ సమస్య తలెత్తుతున్నది. దీంతో ఆ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగడం వల్ల చాలా మంది కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 24 నుంచి డీలర్ స్థాయి వాహన రిజిస్ట్రేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 7 వేల వాహనాలు ఈ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు మాత్రమే డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్ అవుతాయి.
గతంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే నెల రోజుల్లోపు ఎప్పుడైన స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియతో చాలా వాహనాల రిజిస్ట్రేషన్ కారణంగా రద్దీని తగ్గించడం కోసం షోరూంల్లోనే రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ షోరూంలో రిజిస్ట్రేషన్ విధానం పారదర్శకంగా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే స్థానిక ఆర్టీఓ కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని ఆర్టీఏ అధికారులు షోరూంల నిర్వాహకులకు సూచనలు చేశారు.
సాధారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయాల్లో నెలకు 27-30వేల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. గ్రేటర్లో 12 కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఖైరతాబాద్, తిరుమలగిరి, మలక్పేట, బండ్లగూడ, నాగోల్, టోలిచౌకి, రంగారెడ్డిలో మణికొండ, కొండాపూర్, మన్నెగూడ, మేడ్చల్లో మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. ఒక్కరోజుకు 700 నుంచి వెయ్యి వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యేవి.
ఇప్పుడు షోరూంల విధానంతో నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాల ప్రక్రియ కార్యాలయాల్లో జరగడం లేదు. కాగా, షోరూంల్లోని సాంకేతిక ఇబ్బందులు వల్ల వాహన కొనుగోళ్లు కూడా ఆలస్యమవుతున్నాయని వాహన సంఘాల నాయకులు వేముల మారయ్య, సత్తిరెడ్డి, వెంకటేశ్, నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సారథి పోర్టల్ సమస్యలు మరోవైపు షోరూంల సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సారథి పోర్టల్, షోరూం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.