మండలంలో కొనసాగుతున్న అవసరాల గుర్తింపు ప్రక్రియ..
8 ఉన్నత,15ప్రాథమిక,1 ప్రాథమికోన్నత పాఠశాల ఎంపిక
‘మన ఊరు-మనబడి’లో అమలు
మియాపూర్, ఫిబ్రవరి 24 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆలోచనతో మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం పడింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో తొలి దశలో 24 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. తద్వారా ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో తొలి దశలో ఎంపికైన ఈ పాఠశాలల్లో తగినన్ని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రధానంగా టాయిలెట్ల వసతి, తాగునీరు, ప్రహరీ, సౌకర్యవంతమైన డైనింగ్‌హాల్, కిచెన్, ఆకర్షనీయమైన రంగుల వంటి సౌకర్యాలు లభించనున్నాయి. ఇప్పటికే ఈ పథకంపై విప్, ఎమ్మెల్యే గాంధీ మండల విద్యాశాఖ, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పలు దఫాలుగా మన ఊరు మన బడి పాఠశాల అమలుపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వారికి తగు సూచనలు ఇచ్చారు. తొలి దశ కింద ఎంపికైన 24 ప్రభుత్వ పాఠశాలల్లో ఏ తరహా అవసరాలున్నాయో గుర్తించేందుకు ఇప్పటికే ఎంఈవో నేతృత్వంలో ఏఈ సహా ఇతర బృందం సదరు పాఠశాలల్లో పర్యటించి వివరాలను నమోదు చేసింది. త్వరలో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఎంఈవో పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా వచ్చే ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గంలో తొలి దశ కింద ఎంపికైన 31 పాఠశాలలను సౌకర్యాల పరంగా ఉత్తమంగా రూపొందించుకుంటాం. ఇప్పటికే నాణ్యమైన విద్య ద్వారా కార్పొరేట్‌కు గట్టి పోటీ ఇస్తున్న ప్రభుత్వ పాఠశాలలను సౌకర్యాల పరంగా వాటికి పోటీగా అభివృద్ధి పరుచుకుంటాం. పథకం నిధుల సద్వినియోగంపై విద్యాశాఖ అధికారులతో పలు దఫాలుగా సమీక్షించి పాఠశాలల్లో అవసరాల గుర్తింపును పకడ్బందీగా చేపట్టాలని సూచించాం.
– అరెకపూడి గాంధీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శేరిలింగంపల్లి