రేపట్నుంచి జీవో 58,59 కింద దరఖాస్తుల స్వీకరణ
3 జిల్లాల్లో మొత్తం 1,00,684 మందికి లబ్ధి
2014 జూన్ 2కు ముందు ఇండ్లు నిర్మించుకున్న వారే అర్హులు
బంజారాహిల్స్.ఫిబ్రవరి 19 : ప్రభుత్వ భూము లు ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. గతంలో మాదిరి జీవో 58, 59 నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంటూ సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. షేక్‌పేట మండల పరిధిలో 2015లో జీవో 58 కింద సుమారు 3500 మంది, జీవో 59 కింద సుమారు 750 మంది ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించారు. సుమారు 2 వేల దరఖాస్తులు అధికాదాయానికి చెందిన వారివి కావడం, భారీ భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ కావడంతో వాటిని జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మరోమారు అవకాశం కల్పించడంతో గతంలో క్రమబద్ధీకరణ చేసుకోని వారు ఇప్పుడు చేసుకునే వెసులుబాటు కలిగింది.
2014 జూన్ 2 నాటికే..
తాజా జీవో ప్రకారం ప్రభుత్వం కటాఫ్ తేదీని 2014 జూన్ 2గా నిర్ణయించింది. ఈ తేదీ కంటే ముందే సదరు స్థలంలో ఇల్లు ఉన్నట్లు నిరూపించే పత్రాలు చూపించాలి. దరఖాస్తుదారుడి ఆధార్‌కార్డుతోపాటు అతడిపేరుతో ఉన్న కరెంట్ బిల్లు, నల్లా బిల్లు లేదా ఆస్తిపన్ను రసీదు పత్రాల్లో ఏదో ఒకదాన్ని దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. 2014 జూన్ 2 తర్వాత ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేయడం, నోటరీ ద్వారా కొనుగోలు చేసి కరెంట్ బిల్లు, నల్లా బిల్లు ఇచ్చినా క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదు.
జీవో 59తో ప్రయోజనం
జీవో 59 కింద గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు 2014 మార్కెట్ ధర ప్రకారం నిర్దేశిత రుసుము చెల్లించి ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించడంతో షేక్‌పేట మండల పరిధిలో చాలామందికి ప్రయోజనం కలగనుంది. నోటిఫైడ్ స్లమ్స్‌లోని ఇండ్లకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువలో 10శాతం రుసుముగా నిర్ణయించారు. గతంతో పోలిస్తే స్థలాల విలువ భారీగా పెరగడంతో 10శాతం రుసుము చెల్లించేందుకు యజమానులు సిద్ధంగా ఉన్నారు. గతంలో జీవో 59 వల్ల కలిగే ప్రయోజనాలపై సరైన అవగాహన లేక చాలామంది దరఖాస్తు చేసుకోలేదు. బహుళ అంతస్తుల నిర్మాణాలు ఉన్నప్పటికీ క్రమబద్ధీకరణ లేకపోవడంతో క్రయవిక్రయాలకు ఆస్కారం లేకపోయింది. 2014 మార్కెట్ ధర ప్రకారం రెగ్యులరైజ్ చేయించుకుంటే నేరుగా ప్రభుత్వమే సేల్‌డీడ్ ఇవ్వనుండడంతో స్థలాలు అమ్ముకునేందుకు, రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
మూడు జిల్లాల్లో..
హైదరాబాద్ జిల్లాలో 45,485 దరఖాస్తులు, మేడ్చల్‌లో 50 వేలు, రంగారెడ్డిలో 5,199 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో జీవో 58 కింద 10,818 మందికి ఇప్పటికే పట్టాలు అందజేశారు.
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి
జీవో 58,59 కింద క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో చాలామంది ఉచితంగా క్రమబద్ధీకరణ చేయించుకోవచ్చని భారీ భవనాలను సైతం జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి నోటీసులిచ్చి జీవో 59 కింద నిర్దేశిత రుసుము చెల్లిస్తే పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు వస్తాయని చెప్పాం. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. క్షేత్రస్థాయి పరిశీలన చేసి క్రమబద్ధీకరణ చేస్తాం. -శ్రీనివాస్‌రెడ్డి. తహసీల్దార్, షేక్‌పేట మండలం