రేషన్ బియ్యం పక్కదారి
చేతులు మారుతూ..మళ్లీ ఎఫ్‌సీఐ గోడౌన్‌కు చేరుతున్న వైనం
ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్న దళారులు
కోట్లు సంపాదిస్తున్న అక్రమ వ్యాపారులు
నలుగురిని పట్టుకున్న ఎస్వోటీ పోలీసులు
సుమారు 56 టన్నుల బియ్యం..రూ. 8.42 లక్షలు స్వాధీనం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ)/ నేరేడ్మెట్: పేదల కడుపు నింపే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. చేతులు మారుతూ.. తిరిగి ఎఫ్‌సీఐ గోడౌన్‌కు చేరుతున్నది. అక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం ద్వారా లబ్ధిదారులకు..మళ్లీ అటు నుంచి మరో ధరలో ఎఫ్‌సీఐకి వస్తున్నది. ఇలా సర్కిల్లా తిరుగుతున్న ఈ అక్రమ దందాలో దళారులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచేందుకు ఏకంగా నెలకు 30 నుంచి 40 వేలు అద్దె చెల్లించి.. శివారు ప్రాంతాల్లో గోదాములు ఏర్పాటు చేసుకుంటున్నారు. శనివారం రాచకొండ మాల్కజిగిరి ఎస్వోటీ పోలీసులు సుమారు 56 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా, పట్టుకున్నారు. నిందితులు ఈ రేషన్ బియ్యాన్ని తిరిగి ప్రజ్ఞాపూర్‌లోని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు తీసుకెళ్తున్నట్లు తేలింది.
మళ్లీ ఎఫ్‌సీఐకే..
మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌కు చెందిన మేకల రాకేశ్ కుమార్, ఏజెంట్లు భుక్యా లాలు, గుగులోత్ నరేంద్ర, లారీ డ్రైవర్ కొనేరు శేఖర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. తిరిగి ఎఫ్‌సీఐ గోడౌన్‌కు అధిక ధరలతో తరలిస్తున్న గజ్వేలుకు చెందిన సందీప్ పరారీలో ఉన్నాడు. రాకేశ్‌కుమార్ శామీర్‌పేట్ మునీరాబాద్ ప్రాంతంలో ఓ గోదాంను నెలకు రూ. 30 వేలతో అద్దెకు తీసుకున్నాడు. 40 మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. వివిధ కాలనీలు, బస్తీల్లో ఆటోల్లో తిరుగుతూ.. రేషన్ బియ్యాన్ని కేజీకి రూ.8లకు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత రాకేశ్ ఏజెంట్ల నుంచి కేజీకి రూ. 13 చెల్లించి.. తీసుకుంటున్నాడు. తన గోదాంలో 100 టన్నులు సమకూర్చుకున్నాక.. గజ్వేలుకు చెందిన సందీప్‌కు కేజీ రూ. 18కు విక్రయిస్తున్నాడు. రాకేశ్‌కుమార్ గోదాం నుంచి లారీలో సందీప్ వాటిని మరో ప్రాంతానికి తరలించి.. వాటిని అధిక ధరకు అమ్మేసి.. నేరుగా ప్రజ్ఞాపూర్‌లోని గొల్లపల్లి ఎఫ్‌సీఐ గోడౌన్‌కు పంపిస్తున్నాడు.
ఎఫ్‌సీఐ గోదాంకు చెందిన సంచుల్లో..
ఏజెంట్ల ద్వారా అక్రమంగా రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్న రాకేశ్.. వాటిని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు చెందిన గోనె సంచుల్లో నింపుతున్నాడు. అయితే ఎఫ్‌సీఐ గోడౌన్ ముద్రతో ఉన్న సంచులు సందీప్, రాకేశ్కుమార్లకు ఎలా వచ్చాయనేది తేలియాల్సి ఉంది. అంతేకాకుండా సందీప్ ఇలా సేకరించిన బియ్యాన్ని తనకు ఉన్న రైసు మిల్లుల పేరిట దొంగ బిల్లులు రూపొందించి.. వాటి ద్వారా గొల్లపల్లి ఎఫ్‌సీఐ గోడౌన్‌కు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి ఎఫ్‌సీఐ గోడౌన్‌కు చెందిన అధికారులు ఎవరైనా సహకరిస్తున్నారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అరెస్టయిన నిందితుల నుంచి రూ. 8.42 లక్షల నగదు, లారీ, 56 టన్నుల రేషన్ బియ్యం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణను జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.