విద్యార్థులను రోడ్డు దాటిస్తున్న ఐటీ ఉద్యోగులు
సమాజంపై బాధ్యతతో సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్లో నమోదు
నాలుగేండ్లుగా వలంటీర్లుగా సేవా కార్యక్రమాలు
అందరూ ఐదంకెల వేతనం ఉన్న ఐటీ ఉద్యోగులే.. అయినా ఏసీ క్యాబ్‌లు.. ఏసీ క్యాబిన్లు.. ఏసీ మాల్స్‌ను వదిలి సమాజంపై బాధ్యతగా నడిరోడ్డుపైకి వచ్చారు. ఉద్యోగ విధులతో బిజీగా ఉన్నా అవసరార్థులకు తోడ్పాటును అందించాలని సంకల్పించారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సేవా సైనికుల్లా సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్చిదిద్దింది. ఆ సైనికుల బృందంలోని ఐదుగురు సభ్యులు నాలుగేండ్లుగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిజాంపేట కూడలి, సంఘమిత్ర పాఠశాల, కేపీహెచ్‌బీ ఠాణా, తులసీనగర్ చౌరస్తా, ఆదిత్యనగర్ తదితర ప్రాంతాలలో పాఠశాల విద్యార్థులను సురక్షితంగా రహదారి దాటిస్తున్నారు. నిత్యం వెయ్యి మందికిపైగా విద్యార్థులను ఉదయం, సాయంత్రం వేళలో ఈ వాలంటీర్ల బృందం విద్యార్థులకు సేవలను అందిస్తూ తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వహకులు, వాహనదారుల అభినందనలను అందుకుంటున్నది.
మియాపూర్ , మార్చి 30 : నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో విధులు నిర్వహిస్తున్న తల్లం భరత్, నితిన్ , శివ, కిశోర్, గోపీ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్లో వలంటీర్లుగా నమోదై నాలుగేండ్లుగా తమ సేవా నిరతిని కొనసాగిస్తున్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట రోడ్డులో సంఘమిత్ర పాఠశాలకు నిత్యం రెండు వేల మంది విద్యార్థులు వస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఈ వలంటీర్ల బృందం ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకు రహదారిపై ఉంటూ విద్యార్థులను సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నారు. బుధవారం వీరి సేవలను గుర్తించి బొల్లేపల్లి సీతారామరాజు అనే స్థానికుడు వీరిని ఘనంగా సన్మానించారు.
నాలుగేండ్లుగా సేవలందిస్తున్నాం
మా అయిదుగురు సభ్యుల బృందమంతా నాలుగేండ్లుగా వాలంటీర్లుగా సేవలందిస్తున్నాం. సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్లో వలంటీర్లుగా నమోదయ్యాం. రద్దీ సమయంలో నిజాంపేటలో విద్యార్థులను రోడ్డు దాటిస్తాం. ఉదయం , సాయంత్రం వేళలో వాహనాలను నియంత్రిస్తూ, చిన్నారులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలన్నదే మా లక్ష్యం.
– తల్లం భరత్, వలంటీర్ బృంద ప్రతినిధి