నిరుపేద ఆటో డ్రైవర్‌కు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స
ఖర్చులు భరించిన వైద్యులు
మలక్‌పేట, ఫిబ్రవరి 18: మూసారాంబాగ్‌లోని శాలివాహన మల్టీ స్పెషాలిటీ దవాఖాన వైద్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిరుపేద దయనీయ పరిస్థితిని చూసి చలించిన వైద్యులు.. ఖర్చులు భరించి..కీళ్ల మార్పిడి సర్జరీ చేశారు. శుక్రవారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు ప్రమోద్‌కుమార్, శ్రీమన్నారాయణ మాట్లాడుతూ మీర్‌పేటకు చెందిన పి. ఆంజనేయులు(38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని చెప్పారు. రెక్కాడితేగానీ డొక్కాడని అతడి కాలు తొంటి పాడైపోవడంతో కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యాడని వివరించారు. కుటుంబ పోషణ భారంగా మారడం, తొంటి మార్పిడి చేసుకునేందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాడన్నారు. బుధవారం కుటుంబసభ్యులతో కలిసి దవాఖాన వైద్యులను సంప్రదించాడని, అతడి దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయామని చెప్పారు. తమ వంతుగా సహాయం చేసి ఆదుకోవాలని నిర్ణయించుకొని.. తొంటి మార్పిడి ప్రక్రియకు సిద్ధపడ్డామని చెప్పారు. గురువారం విజయవంతంగా సర్జరీ చేశామని వెల్లడించారు. రూ. 3-4 లక్షలు అయ్యే ఈ ఆపరేషన్‌కు సగానికి పైగా ఖర్చును తామే భరించి ఈ శస్త్ర చికిత్స చేశామన్నారు.