సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో మరో భారీ వంతెన అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్ అందుబాటులోకి రాగా వచ్చే నెలలో బహుదూర్‌పుర ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. పడమర నుంచి తూర్పు వైపు శంషాబాద్ నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ మీదుగా యాదాద్రి, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ట్రాఫిక్ తిప్పలు తప్పకపోయేవి. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీపీ) ద్వారా చేపడుతున్న పలు రోడ్ల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుండటంతో ప్రస్తుతం పాతబస్తీలోనూ సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ మెరుగుపడుతున్నది.
బహుదూర్ ప్రాజెక్టుతో బహు ప్రయోజనాలు..
బహుదూర్‌పుర ప్రాజెక్టును మొత్తం రూ.69 కోట్లతో చేపట్టారు. ముఖ్యంగా ఈ ఫ్లై ఓవర్‌కు రెండు పక్కల సర్వీస్ రోడ్డు, నీరు నిల్వకుండా మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టారు. ఈ వంతెనతో ఆరాంఘర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ తగలకుండా వెళ్లిపోవచ్చు. ఇప్పటికే అబ్దుల్ కలాం, బహుదూర్‌పుర ఫ్లై ఓవర్లు పూర్తి కాగా.. ఇక ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు బైరామల్‌గూడ ఫ్లై ఓవర్ పనులు పూర్తి అయితే పాతబస్తీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.