‘మన బస్తీ-మన బడి’కి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ రానున్నదని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నట్లు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్ పరిధిలో ‘మన బస్తీ-మన బడి’ అమలుపై మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యా శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.7,289.54 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదాబాద్‌లోని మొత్తం 690 ప్రభుత్వ పాఠశాలల్లో 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని.. ‘మన బస్తీ – మన బడి’ కింద మొదటి విడుతలో 239 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 10 స్కూళ్ల చొప్పున అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డిజిటల్ విద్య అమలు కోసం ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో ప్రణాళికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి.. ప్రజాప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలన్నారు. పలు చోట్ల అవసరమైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తేగా సోమవారం జరగనున్న మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చిస్తామన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒకరి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాతలు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐల సహకారం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎంఎస్ .ప్రభాకర్, సురభి వాణీదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ బిన్ బలాల, కలెక్టర్ శర్మన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి పాల్గొన్నారు.