సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఇంత భారీ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోలేదని, మన రాష్ట్ర ఉద్యోగార్థులకే ఉద్యోగాలు దక్కేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జోనల్ విధానాన్ని తెచ్చారని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టుడే-కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాభ్యర్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 21st సెంచరీ పబ్లికేషన్ సీనియర్ ఫ్యాకల్టీ శ్రీహరి కాకర్ల రచించిన ‘ఇండియన్ జాగ్రఫీ ఫర్ మెయిన్స్ ఇన్ క్వషన్ అండ్ ఆన్సర్స్’ అనే పుస్తకాన్ని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.నవీన్ చంద్ర, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంగీపురం ప్రశాంతిలతో కలిసి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్, డైరెక్టర్ రమణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉద్యోగాభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.
అనంతరం గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నివర్గాలు, అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు దక్కే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకొన్నారని కొనియాడారు. జోనల్, మల్టీజోనల్ విధానాలతో ఉద్యోగాలను సొంత రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు దక్కే ప్రణాళికలతో ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఈ సదస్సుకు వచ్చిన వారందరూ మొదటిమెట్టు దాటుకొని వచ్చిన వారని, నోటుపుస్తకం పట్టుకొని రెండో అంచను దాటినట్లని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వ విధానాలు (పాలసీలు) స్కోరింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని, అందుకనుగుణంగా చదివితే ప్రిలిమినరీ దశను దాటేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మొదటి భాగంలో ఆరు, రెండో భాగంలో 6 అంశాలను దృష్టిలో పెట్టుకొని చదువును కొనసాగించాలని పేర్కొన్నారు.
మొదటి భాగంలో ఆరు సూత్రాలు
1. సిలబస్‌పై సమగ్రమైన అవగాహన
2. పరీక్షా విధానం-తదనుగుణంగా ప్రిపరేషన్
3. పూర్వపు ప్రశ్నాపత్రాల విశ్లేషణ
4. ప్రశ్న – జవాబుల ప్రాక్టీస్
5. ప్రామాణిక గ్రంథాల ఎంపిక
6. ప్రిపరేషన్ – రివిజన్
రెండో భాగంలో ఆరు సూత్రాలు
1. అపోహలు-ఆందోళనలు-సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మొద్దు
2. నిరంతరం అధ్యయనాన్ని కొనసాగిస్తుండాలి. ఏకాగ్రత-ధారణ అవసరం (జ్ఞాపక శక్తి)
3. ప్రణాళిక – కార్యాచరణ ప్రణాళిక (ప్లానింగ్-యాక్షన్ ప్లానింగ్)
4. పోటీ పరీక్షల వాతావరణాన్ని సృష్టించుకోవడం – తదనుగుణంగా మసులుకోవడం
5. సమయపాలన (టైం మేనేజ్మెంట్)
6. సాధించాలనే తపన-ఊహాశక్తిని కలిగించుకోవడం
అకడమిక్ నుంచి పోటీ విధానానికి మారాలి
1. ఆబ్జెక్టివ్ టైప్ పోటీ పరీక్ష విధానం
2. డిస్క్రిప్టివ్ పోటీ పరీక్ష విధానం
3. ఫిజికల్ ప్రాక్టిస్ పోటీ పరీక్ష విధానం (పోలీస్ విభాగం)
4. ఇంటర్వ్యూ పోటీ పరీక్ష విధానాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇలా అన్ని కోణాల్లో ప్రిపరేషన్ అయిన వారు స్కోరింగ్ చేసే అవకాశం మెండుగా ఉండే అవకాశం ఉంటుంది.
ఉద్యోగంపై నమ్మకం ఏర్పడింది
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు మెగా సెమినార్ ఎంతోగానో ఉపాయోగపడింది. సిలబస్‌పై అవగాహన ఏర్పడింది. ఈ సదస్సు వలన ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఏర్పడింది. సదస్సును నిర్వహించిన నమస్తే తెలంగాణకు, కృష్ణ ప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీకి ధన్యవాదాలు.
– మహేందర్, ఓయూ విద్యార్థి
ప్రణాళిక తెలిసింది
గ్రూప్స్ సాధించాలంటే ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలో, మైక్రో లెవెల్ టైం టేబుల్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో సదస్సులో వక్తలు తెలిపారు. సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాలను ప్రటించారు. చాలా సంతోషకరమైన విషయం. చదువుకునేందుకు వీలుగా నోటిఫికేషన్ ప్రకటించడానికి సమయం తీసుకోవాలి.
– ప్రకాశ్, రంగారెడ్డి, గ్రూప్స్ అభ్యర్థి
సెమినార్ సూపర్
సదస్సులో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాము. చాలా బాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 80వేలకు పైగా ఉద్యోగాలు ప్రటకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు రుణపడి ఉంటాము.
– కుమార్, గ్రూప్స్-1 అభ్యర్థి
ఈసారి ఉద్యోగం పక్కా
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా కల. సీఎం కేసీఆర్ ఈ సారి భారీ స్థాయిలో ఉద్యోగాలు ప్రకటించారు. ఈసారి తప్పకుండా ఉద్యోగం సాధిస్తాననే విశ్వాసం ఉంది. ఈ సదస్సు వలన ప్రభుత్వ ఉద్యోగం సాధించేందకు కావాల్సిన విజయ రహస్యాలు తెలిశాయి.ప్రతీ విషయాన్ని నోట్ చేసుకున్నా. ప్రణాళికతో చదివి.. పరీక్షకు సన్నద్ధం అవుతాను.
– నాగమణి, గ్రూప్ 2 అభ్యర్థి
భయం పోయింది..
సదస్సులో గ్రూప్స్-1లో మంచి ర్యాంకు సాధించి ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్ గౌడ్, ప్రశాంతిలు పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. వారి నుంచి అనేక మెళకువలు తెలసుకున్నాము. పోటీ పరీక్షలు అనగానే చాలా భయంగా ఉండేది ఈ సదస్సులో వల్ల భయం పోయి ధైర్యం వచ్చింది.
– కృష్ణ చైతన్య పోటీ పరీక్షల అభ్యర్థి
కొత్త విషయాలు తెలిశాయి
ఈ అవగాహన సదస్సు ఎంతోగానో ఉపయోగపడింది. అనేక కొత్త విషయాలు ఈ సదస్సు ద్వారా తెలుసుకోగలిగాము. ప్రతి వక్త చేప్పిన మాటలను విని రాసుకున్నాను. పోటీ పరీక్షలకు ఏ విధంగా చదువాలి, ఎలాంటి పుస్తకాలు ఎంచుకోవాలి, సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
– జోత్స్న, గ్రూప్స్-1 అభ్యర్థి
ఇదే మొదటిసారి
నేను ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్నాను. మొదటిసారి పోటీ పరీక్షకు సిద్ధం అవుతన్న. ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని సదస్సులో చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. సదస్సు వలన ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది.
– రజిత, గ్రూప్స్- 2 అభ్యర్థి, నిర్మల్