సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ ) : వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల్లో ప్రవహిస్తున్న వరద ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు భద్రత చర్యలు చేపట్టింది. చైన్‌లింక్ మెష్, ప్రమాద నివారణకు హెచ్చరిక సైనేజీ బోర్డు, ప్రీకాస్ట్ స్లాబ్స్ పనులు చేపట్టారు. ఎస్ఎన్డీపీలో భాగంగా ఇప్పటికే నాలాల పునరుద్ధరణ, రిటర్నింగ్ వాల్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న సంగతి తెలిసిందే.
నాలాల ప్రమాదాల నివారణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రతి జోన్లో భద్రత చర్యలు చేపడుతున్నారు. అయినా .. ప్రజలు నిర్మాణ, ఇతరత్ర వ్యర్థాలు నాలాల్లో వేస్తున్నారు. ఆయా ప్రదేశాలను గుర్తించి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీనగర్ జోన్లో 74 పాయింట్లలో భద్రత చర్యల్లో భాగంగా చైన్ లింక్ మెష్ (ఇనుప జాలీ), సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. కూకట్పల్లి జోన్లో 10 చోట్ల, ఖైరతాబాద్ జోన్లో 85 ప్రాంతాలు, చార్మినార్ జోన్లో 52 పాయింట్లు, శేరిలింగంపల్లి జోన్లో 24 చోట్ల భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత నివారణ చర్యలతో పాటు ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.