మన బస్తీ-మన బడితో మొదటిదశలో అభివృద్ధి
నియోజకవర్గానికి 10 స్కూళ్ల ఎంపిక
తరగతి గదులు, ఆటస్థలాలు, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో పాఠశాలల భవనాలు
సమీక్షలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన బస్తీ – మన బడి’ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన అందుబాటులోకి రానున్నది. జిల్లాలో మొత్తం దాదాపు 690 పాఠశాలలుండగా.. ఇందులో 499 ప్రాథమిక, 189 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కేవలం తొమ్మిది మాత్రమే ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఉన్న 189 ఉన్నత పాఠశాలల్లో 70కి పైగా స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతున్నది.
12 రకాల వసతులు..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల బోధన అందుబాటులోకి రాబోతున్నది. పైగా ఆయా పాఠశాలల్లో మెరుగైన బోధన అందనున్నది. రాష్ట్ర కాబినెట్ నిర్ణయం మేరకు మొత్తం జిల్లాలో ‘మన బస్తీ-మన బడి’ కింద 239 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ స్కూళ్లలో 12 రకాల వసతులను అధికారులు కల్పించబోతున్నారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీలు, వంట గదులను నిర్మించనున్నారు.
డిజిటల్ క్లాసులు..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆంగ్ల బోధనతో పాటు డిజిటల్ క్లాసులనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని.. ప్రస్తుతం ఉన్న 690 పాఠశాలల్లో దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారులు వివరిస్తున్నారు. భవిష్యత్లో ఈ సంఖ్య మరింత పెంచేలా జిల్లా విద్యాధికారులు కృషి చేస్తున్నారు. అంతేకాక జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దృష్టి సారిస్తున్నారు.