
మేడ్చల్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల చివరి వారం వరకు వానకాలం వడ్ల కొనుగోలును పూర్తి చేసేందుకు ఫౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటుంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్ష 6 వేల క్వింటాళ్లను రైతుల నుంచి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 1927 మంది రైతులకు ప్రభుత్వం రూ.20 కోట్ల 77 లక్షల చెల్లింపులు చేసింది. వరి కోతలు చివరి దశకు చేరిన నేపథ్యంలో ఈ నెల చివరి వారం వరకు వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయనున్నట్లు ఫౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్ తెలిపారు. వడ్ల కొనుగోలు పూర్తయిన మండలాలలో కొనుగోలు కేంద్రాలను మూసివేయనున్నారు. ఫౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో వడ్ల కొనుగోలును నిర్వహిస్తున్నారు.
విక్రయాలపై వివరాలు సేకరణ..
వానకాలంలో పండిన వడ్ల విక్రయాలపై రైతుల నుంచి వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందు పంటల సాగు వివరాల నమోదు ఆధారంగా వడ్లు పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలలో విక్రయించారా? లేదా? అన్న విషయాలను రైతులను అడిగి తెలుసుకుని ఫౌర సరఫరాల శాఖ సమాచారం అందిస్తున్నారు. ఈ నెల చివరి వారం వరకు వడ్ల విక్రయాలు పూర్తి కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల నుంచి వడ్ల కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.