సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి డివిజన్ పరిధిలో విద్యుత్ మీటర్ల గల్లంతుపై ఎస్పీడీసీఎల్ విచారణ నామమాత్రంగా జరుగుతోందనే విమర్శలున్నాయి. అయితే ఇది ఇంటిదొంగల పనే అని స్థానికంగా బలమైన టాక్ నడుస్తోంది. కాగా గల్లంతైన వాటిలో ఇటీవల 42 విద్యుత్ మీటర్ల దొరికినప్పటికీ ఎలా మాయమయ్యాయి, ఎక్కడ దొరికాయి అనే విషయం తెలుసుకునేందుకు కనీసం విచారణ కమిటీని వేయకుండా కేవలం ఒక ఏవో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసి వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నగర శివారల్లో ఇప్పటివరకు 225 మీటర్లలో మెజార్టీ మీటర్లు గల్లంతు అయినప్పటికీ అధికారులు మాత్రం కిమ్మనకుండా ఉన్నారు. అసలు ఈ వ్యవహారం వెనక బడా నేతలు ఉన్నారనే విమర్శలు సైతం లేకపోలేదు.
మొదటి నుంచీ గందరగోళమే..!
గండిపేట రెవెన్యూ సర్వే నెంబర్ 246 చిత్రపురి కాలనీలోని పలు నిర్మాణాలకు తెలుగు సినీవర్కర్స్ కో ఆపరేటివ్ సొసైటీ పేరుతో జనవరి 7న 42 విద్యుత్ మీటర్లు జారీ అయ్యాయి. ఇలా డిస్కం జారీ చేసిన మీటర్లను దరఖాస్తు దారుని ఇంట్లో పెట్టకుండా విద్యుత్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇంట్లో ఉంచారు. డిస్కం మంజూరు చేసిన మీటర్లకు ఆ మరుసటి నెల నుంచే రీడింగ్, బిల్లుల జారీ ప్రక్రియను చేపట్టాలి. అయితే ఫిబ్రవరి, మార్చి నెలలకు ఏ ఒక్క మీటర్‌కు రీడింగ్ నమోదు కాలేదు.
ఏప్రిల్‌లో డిస్కం సిబ్బంది కాంట్రాక్టర్ ఇంటికి చేరకుని కనెక్షన్ ఇవ్వని ఖాళీ మీటర్లకు మినిమం బిల్లులు జారీచేశారు. రీడింగ్ మిషన్‌లో అమర్చిన జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇలా కొల్లగొట్టిన మీటర్లను గుర్తించారు. ఈ సెక్షన్ పరిధిలో ఇప్పటివరకు 225 మీటర్లు జారీ చేయగా వీటిలో ఇప్పటికే భారీగా రీడింగ్ నమోదైన మీటర్లు కనిపించకుండా పోయినట్లు తెలిసింది. అయితే ఈ మీటర్లను గుర్తించడం ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ వ్యవహారం పూర్తిగా బయటకు వస్తే మరికొంతమంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉంది. వాస్తవానికి చిత్రపురి కాలనీలో ఉన్న 225 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ కోసం 2021 ఆగస్ట్ 21న రిజిస్టర్ చేయగా 2025 జనవరి 7న మంజూరి చేశారు. ఈ మధ్యలో ఎస్టిమేట్లు రివైజ్ చేయడం, వినియోగదారుడు చెల్లించడం వంటివి జరిగాయి. 2024 ఫిబ్రవరిలో ఎస్టిమేట్ క్లోజ్ చేశారు. అయితే ఇక్కడ మీటర్ బిగించకుండా ఒకనెల బిల్లు రాకుండా ఎస్టిమేషన్ క్లోజ్ చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్‌తో పాటు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం వల్లే మీటర్ల గోల్మాల్ జరిగిందని ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా కేటగిరీ మార్పు..!
చిత్రపురి కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన విద్యుత్ మీటర్లు కేటగిరీ-1 కింద అలాట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 225 మీటర్లు ఇవ్వాల్సి ఉండగా, మొదటి దశలో 42 మీటర్లు ఇచ్చినట్టుగా అధికారులు తెలిపారు. మరికొన్ని మీటర్లు కూడా మంజూరీ అయి బిల్లులు వస్తున్నాయని.. అయితే వీటిలో అత్యధికంగా బిల్లులు వస్తున్న వాటి జాడే లేకుండా పోయిందని డివిజన్‌కు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ప్రధానంగా కొంతమంది వినియోగదారుల ఇళ్లకు ఎన్ఓసీ లేకున్నా మొదటి కేటగిరీలో మీటర్లు ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.
ఎన్ఓసి లేనప్పుడు కేటగిరీ-2 కింద మీటర్లు ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడు కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఒకవైపు మీటర్లు బిగించకుండా నిల్వ ఉంచడమే కాకుండా కేటగిరి మార్చడంతో విద్యుత్ సిబ్బంది తమ ప్రయోజనాల కోసం సంస్థ ఆదాయానికి గండికొట్టారని ఇప్పుడు డిస్కంలో జోరుగా చర్చ సాగుతోంది. అక్రమంగా నిల్వ ఉంచిన మీటర్లకు గచ్చిబౌలి సబ్‌స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది బిల్లులు ఇచ్చారు. మీటర్ల గోల్మాల్ వ్యవహారంలో డిస్కం అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో మిలాఖత్ అయి ఈ దందా నడిపినట్లు సమాచారం.
ఇప్పటివరకు 225 మీటర్లలో ఎన్ని మీటర్లు ఇచ్చారు.. అవి ఎక్కడ ఉన్నాయి. వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటనే దిశగా డివిజన్ అధికారులు ఆరా తీస్తున్నా.. ఉన్నతస్థాయిలో మాత్రం వీటిపై ఎలాంటి సమాచారం లేదు. గచ్చిబౌలి డివిజన్‌కి సబంధించి విద్యుత్ మీటర్ల వ్యవహారంలో ఎవరూ తలదూర్చవద్దంటూ డిస్కంకు చెందిన ప్రధాన అధికారి నుంచి కిందస్థాయి అధికారులకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.