ఓపీ బ్లాక్ భవనం సైతం..
నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్‌రావు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కిడ్నీ రోగులకు మరింత ఉపశమనం కలుగనున్నది. నగరంలో మరో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కానున్నది. పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదనంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో మరో సెంటర్‌ను నెలకొల్పేందుకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
నిరుపేదలపై తగ్గిన ఆర్థిక భారం..
సాధారణంగా ఒక్కసారి డయాలసిస్ చేయించాలంటే కార్పొరేట్ దవాఖానలో రూ.3వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతుంది. రోగి ఆరోగ్యపరిస్థితి ఆధారంగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు రక్తశుద్ధి చేయాల్సి ఉంటుంది. మరికొందరికి నెలలో రెండు లేక ఒకసారి తప్పనిసరి. ఈ క్రమంలో ఒక రోగికి ప్రతి నెల సుమారు రూ.12వేల నుంచి రూ.20వేల వరకు ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా నిరుపేద రోగులకు ఇది చాలా ఇబ్బందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు అన్ని జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పి.. ఆపన్న హస్తం అందించింది. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలోని మలక్‌పేట ఏరియా హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ పర్యవేక్షణలో డి-మేడ్-సెంటర్ల పేరుతో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానల్లో నెఫ్రాలజీ విభాగంలో అదనంగా డయాలసిస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు డీ-మేడ్ సెంటర్లను ఏర్పాటు చేయగా, గ్రేటర్ పరిధిలోకి వచ్చే మహేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ), వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో రెండు డీ-మేడ్-కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. త్వరలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో కూడా సేవలు అందుబాటులోకి రానుండడంతో నిరుపేద కిడ్నీ రోగులకు మరింత ఉపశమనం కలుగనున్నది.