సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 6: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో మూడు రోజుల ఓ పసికందు మృతి చెందాడు. ఈ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. గోల్నాకకు చెందిన సాయికిరణ్, కవిత దంపతులు. ఈ నెల 3న కవిత తీవ్ర నొప్పులతో రాత్రి 8.30 గంటల సమయంలో దవాఖానలో చేరింది. నెలలు నిండటంతో అదే రోజు రాత్రి 10.40 గంటలకు కవిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు 2.6 కిలోల బరువుతో జన్మించాడు. 5వ తేదీ మధ్యాహ్నం ఆ పసికందు శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి.. నీరసించడంతో వైద్యులు ఎస్‌ఎన్‌సీయూలో పరీక్షించి.. బాబు ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. పుట్టిన 24 గంటలలోపు శిశువులకు ఇచ్చే వ్యాక్సిన్ ఇచ్చారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో పసికందు నీలం రంగులోకి మారి.. తీవ్ర అస్వస్థతకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే వైద్యుల వద్దకు వెళ్లగా.. బాబు మరణించినట్లు తెలిపారు.
సాధారణంగా బాబును పడుకోబెట్టి పాలు తాగించడంతో ఇలాంటిది సంభవిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే, బంధువులు మాత్రం.. పసికందు మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. వైద్యులు తక్షణమే రావాలంటూ వార్డులో ఉన్న మందుల ట్రేలను, ఫర్నిచర్‌ను కిందపడేశారు. వారిని సముదాయించేందుకు వెళ్లిన ఆర్‌ఎంఓపై దూషణలు చేస్తూ.. దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి పసికందు మృతికి కారణాలు తెలుసుకొని బంధువులతో చర్చించి, వారిని సముదాయించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం బంధువులు పసికందు మృతదేహాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోయారు. దవాఖానలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
నేలపై పడుకోబెట్టడంతోనే..
కోఠి మెటర్నటీలో శనివారం రాత్రి 10.40 నిమిషాల సమయంలో పుట్టిన మగ బిడ్డ పూర్తి ఆరోగ్యంతో జన్మించాడు. మూడు రోజుల పాటు ఆరోగ్యంగానే ఉన్న ఆ పసికందు.. మూడు రోజుల తర్వాత మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టిన పిల్లలకు తల్లి పాలే శ్రేయస్కరమని, తల్లిపాలు సరిపోని పక్షంలో ఇతర పాలను తాగిస్తారని వైద్యులు తెలిపారు. ఈ కేసులో పసికందును పడకపై కాకుండా బంధువులు నేలపై పడుకోబెట్టారని, బాబును పడుకోబెట్టే పాలు తాగించారని, ఆ పాలు ఊపిరితిత్తుల్లోకి దిగి పసికందు మృతి చెంది ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. పసికందు శరీరంలో ఉష్ణం, షుగర్ లెవెల్ తగ్గడం వంటి లక్షణాలతో మృతి చెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యమేమి లేదు: డాక్టర్ కె.రాజ్యలక్ష్మి
పసికందు మృతిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మిని వివరణ కోరగా.. వైద్యుల నిర్లక్ష్యమేమి లేదన్నారు. ఈ నెల 3న జన్మించిన బాబు.. మూడు రోజుల పాటు ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. తల్లి పక్కన ఉండాల్సిన బాబును సోమవారం రాత్రి పసికందు అమ్మమ్మ తనతో పాటు కింద పడుకోబెట్టుకున్నదని తెలిపారు. దీంతో ఆ పసికందు టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోయిందని, వైద్యులు అందుబాటులో ఉన్నా.. సమాచారం ఇవ్వలేదన్నారు. తెల్లవారు జామున బాబు మృతి చెందితే.. కుటుంబ సభ్యులు వారి తప్పును వైద్యులపైకి నెట్టడం ఎంత వరకు సమంజసమని అన్నారు. కుటుంబ సభ్యులు దవాఖానలోని మూడవ అంతస్తులో ఉన్న పోస్ట్ ఆపరేటివ్ వార్డులోకి ప్రవేశించి ఫర్నిచర్, రోగులకు ఇచ్చే మందుల ట్రేలను ధ్వంసం చేశారని, తోటి రోగులను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. దవాఖానపై దాడికి పాల్పడిన వారిపై సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.