పీర్జాదిగూడ, ఫిబ్రవరి 18: కల్తీ రాగి పిండి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి..నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం..ప్రశాంత్నగర్కాలనీలో నివాసముంటున్న గొల్ల బాల సంజీవ (42) వ్యాపారి. పంచవటీకాలనీలో కొంతకాలం నుంచి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని పరిసర ప్రాంతాల వారి నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని పిండిగా మార్చి.. స్వచ్ఛమైన రాగిపిండిలో కలుపుతున్నాడు. 500 గ్రాముల ప్యాకెట్లు రూపొందించి.. నగరంలోని కిరాణ దుకాణాలకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు ఆ స్థావరంపై దాడి చేసి.. నిర్వాహకుడిని పట్టుకున్నారు. 2.8 టన్నుల రేషన్ బియ్యం, 350 కల్తీ రాగిపిండి ప్యాకెట్లు, 300 కేజీల బియ్యం పిండి, ఇతర యంత్రాలను స్వాధీనం చేసుకొని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.