సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్.. తాజాగా గర్భవతుల కోసం మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నది. మాతా శిశు సంరక్షణలో భాగంగా కడుపులో బిడ్డ ఎదుగుదలతో పాటు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించే టిఫా స్కానింగ్‌ను మరింత వేగవంతంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు టిఫా స్కానింగ్ యంత్రాలు గాంధీ, నిలోఫర్ వంటి దవాఖానల్లో ఒక్కో యంత్రం మాత్రమే ఉండటంతో అందరికి పరీక్షలు చేయడం కొంత ఇబ్బందిగా ఉండేంది. ఈ క్రమంలో కొంత మంది గర్భిణులు ప్రైవేట్ డయోగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ప్రసూతి దవాఖానలకు వచ్చే రోగుల రద్దీకి అనుగుణంగా టిఫా స్కానింగ్ యంత్రాలను సమకూరుస్తున్నది.
గాంధీ, నిలోఫర్‌లో..
గ్రేటర్ పరిధిలోని నిలోఫర్, పేట్లబుర్జు, గాంధీ, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రసూతి దవాఖానల్లో ఈనెల 18న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వర్చువల్ పద్ధతిన అన్ని యంత్రాలను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఇప్పటికే కొన్ని దవాఖానలకు యంత్రాలను సమకూర్చారు. మరికొన్ని దవాఖానలకు ఒకటి రెండు రోజుల్లో టిఫా స్కానింగ్ యంత్రాలను సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించేందుకే..
ప్రతి గర్భవతికి టిఫా స్కానింగ్ తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు. కడుపులో ఉన్న బిడ్డకు ఏవైనా పుట్టుకతో వచ్చే లోపాలు ఉంటే వాటిని టిఫా స్కానింగ్‌తో గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. లోపాలను ముందుగానే గుర్తించడంతో అవసరమైన చికిత్స అందించడం.. లేదా.. పరిష్కరించేందుకు వీలులేని సమస్యలుంటే అబార్షన్ చేసేందుకు వీలుంటుందని వైద్యనిపుణులు తెలిపారు. 5 నెలల గర్భవతులకు మాత్రమే ఈ టిఫా స్కానింగ్ చేయడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. 5వ నెలలో శిశువుకు అవయవాలు దాదాపు 50 శాతం వృద్ధి చెందుతాయని ప్రసూతి వైద్యనిపుణులు తెలిపారు.
ముందస్తుగా లోపాలను గుర్తించవచ్చు..
సాధారణంగా టిఫా అనేది 5నెలల గర్భవతికి చేస్తారు. 24 వారాలు దాటితే చట్టపరంగా అబార్షన్ చేయడానికి వీలులేదు. అందుకని 5 నెలల్లో టిఫా స్కాన్ చేయాలనేది ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. 5 నెలల్లో శిశువుకు అన్ని రకాల అవయవాలు 50 శాతం వరకు ఏర్పడతాయి. ఏవైనా లోపాలు ఉంటే.. ఈ టిఫా స్కాన్ ద్వారా తెలిసిపోతుంది. అంతే కాకుండా.. శిశువుకు అవయవాలు సరిగ్గా ఏర్పడ్డాయా..! లేదా..! తెలుసుకోవచ్చు. చిన్న లోపాలు ఉంటే అవసరమైన చికిత్స చేసేందుకు వీలు ఉంటుంది. మేజర్ డిఫెక్ట్ ఉంటే అబార్షన్ చేయించుకునే వెసులుబాటు గర్భవతికి ఉంటుంది.
– డాక్టర్ మాలతి, సూపరింటెండెంట్, పేట్లబుర్జు ప్రసూతి దవాఖాన