సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : దేశ వ్యాప్తంగా ఉన్న 61 కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖలు, ఆర్మీ చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలను దశాబ్దంగా సక్రమంగా విడుదల చేయకపోవడంతో కంటోన్మెంట్ బోర్డుల పాలన తీవ్రంగా దెబ్బతింటున్నది. చెల్లింపుల కొరత కారణంగా కంటోన్మెంట్ బోర్డులు రోజువారీ నిర్వహణకే నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నాయి. సిబ్బంది జీత భత్యాలకే పరిమితమైన పరిస్థితుల్లో స్థానిక నిధులతో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేకుండా పోతున్నది.
ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు రూ.1145.17 కోట్ల బకాయిలు చెల్లింపులు జరపాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే కంటోన్మెంట్ పరిపాలన దయనీయ స్థితికి చేరిందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 15 కంటోన్మెంట్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ సర్వీస్ చార్జీల నివేదికను అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం. శ్రీనివాస్ విడుదల చేశారు. 15 కంటోన్మెంట్ బోర్డుల్లో అత్యధికంగా యూపీ కాన్పుర్‌లో రూ.1188.92 కోట్లు ఉంటే రెండో స్థానంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉందని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న సర్వీస్ చార్జీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తక్షణ చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు.