సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసింగ్ పోటీల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ఫార్ములా-ఈ కో ఫౌండర్ అండ్ చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బెర్టో లొంగొ ప్రశంసించారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఆసక్తి, నిరంతర పర్యవేక్షణ కారణంగా ఈ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇదొక బిగ్ చాలెంజ్ అని.. పోటీలు విజయవంతంగా జరిగేలా అన్నీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌లో భాగంగా బుధవారం హైటెక్స్‌లో ‘ద పవర్ ఆఫ్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్’ అంశంపై ప్యానల్ డిస్కషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆల్బెర్టో లొంగొ, ఎన్విజన్ రేసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సైల్వేన్ ఫిలిప్పి, ఫార్ములా-ఈ స్ట్రాటజీ డైరెక్టర్ హారి బ్రౌనీలు, టీ వర్క్స్ సీఈఓ సుజై కారంపురిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆల్బెర్టో మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ పోటీలకు గ్రీన్కో సేవలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ స్పోర్ట్స్ అభిమానుల మదిలో ఈ ప్రిక్స్ పోటీలు ఒక మైల్స్టోన్ ఈవెంట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. 11 టీంలు, 22 మంది డ్రైవర్లు ఈ పోటీలో తమ ప్రతిభను పరీక్షించుకోనున్నారు. ఈ పోటీలతో ప్రపంచ నగరాలైన లండన్, బెర్లిన్, మెక్సికో, రోమ్, మొనాకో తదితర ఐకానిక్ ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ చేరిందని అన్నారు. ఈ ప్రిక్స్ పోటీలతో ఎలక్ట్రిక్ వాహనాలపై అందరికి అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.