ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పరిపాలనా భవనంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు పలువురు ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం, ప్రొ. రవీందర్ యాదవ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను మరింత ఉన్న శిఖరాలకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపై ఉన్నదని అన్నారు.
ఇందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. నిబంధనలకు కట్టుబడి, అంకిత భావంతో పనిచేసినపుడే అనుకున్నది సాధించగలమని అన్నారు. వ్యక్తులు తాత్కాలికమని, సంస్థ ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏడాదిగా తనకు సహకరించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఙతలు తెలిపారు. నిర్ణీత వ్యవధిలోగా అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఏడాది అనుభవాన్ని తీసుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, పీఆర్వో డాక్టర్ శ్రీనివాసులు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.