బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 10 : పేదల వద్దకే వైద్య సేవలు తీసుకురావాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం, పద్మారావునగర్‌లోని హమాలీ బస్తీలో ఏర్పాటుచేసిన నూతన బస్తీ దవాఖానను శుక్రవారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వైద్య పరీక్షలు, వైద్యం, మందులను పూర్తి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.
బస్తీ వాసులు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి డివిజన్లో రెండు చొప్పున 300 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు 259 దవాఖానలు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కె.హేమలత, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సక్కుబాయి, బస్తీ దవాఖాన మెడికల్ ఆఫిసర్ డాక్టర్ జిక్రా పాల్గొన్నారు.