సెల్ఫ్ డ్రైవ్ కోసమని కార్లు అద్దెకు..
జీపీఎస్ తొలగించి..నంబర్ పేట్లు మార్చి విక్రయం
పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా
ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు అరెస్టు
రూ. 84.94 లక్షల విలువైన 5 కార్లు, బైకు స్వాధీనం
మన్సూరాబాద్, ఫిబ్రవరి 11: సెల్ఫ్ డ్రైవ్ కోసమని ఆన్లైన్లో కార్లను అద్దెకు తీసుకొని.. అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని భీమవరం మండలం, చిన్నమిరం గ్రామానికి చెందిన గుడ్డాటి మహేశ్ నూతన్‌కుమార్ (28) మొబైల్ టెక్నీషియన్. ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఇతడు.. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న మహేశ్.. నాలుగుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.
ఆన్లైన్లో అద్దెకు ఇచ్చే కార్లపై ..
జైలు నుంచి విడుదలయ్యాక మహేశ్ ఆన్లైన్లో అద్దెకు ఇచ్చే కార్లపై దృష్టి పెట్టాడు. ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటూ.. రూమ్మేట్స్ ధ్రువీకరణ పత్రాలు అపహరించి.. వాటితో జూమ్ కార్స్, డ్రైవ్జీలలో కార్లు, రాయల్ బ్రదర్‌లో బైకులు అద్దెకు తీసుకునేవాడు. వాటికి జీపీఎస్‌లను తొలగించి.. నకిలీ నంబర్ ప్లేట్లను బిగించి.. వాటిని విక్రయించేవాడు. ఇతడికి షేక్ మున్వర్ అలియాస్ మున్నా (35), కొండా సాయి మదన్ (21) సహాయపడేవారు. గతేడాది క్రెటా కారును కిరాయికి తీసుకున్న మహేశ్ ముఠా.. తిరిగి అప్పగించలేదు. బాధితుడు ఫిర్యాదుతో చైతన్యపురి సీఐ రవికుమార్ నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ప్రధాన నిందితుడు మహేశ్ నూతన్‌కుమార్‌తో పాటు మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 84.94 లక్షల విలువైన 5 కార్లు, బైకును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.