శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 06, 2020 , 02:19:25

ఇక ‘డబుల్‌' పరుగులు!

ఇక ‘డబుల్‌' పరుగులు!
 • నిధుల విడుదలకు ప్రభుత్వం సానుకూలం
 • రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపునకు హామీ
 • ప్రతిపాదనలు పంపుతున్న జీహెచ్‌ఎంసీ
 • దశలవారీగా పంపిణీకి సన్నాహాలు

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: గత కొంతకాలంగా మందకోడిగా సాగుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన 55075ఇళ్లను దశలవారీగా పంపిణీచేయాలని నిశ్చయించారు. మిగిలినవాటి నిర్మాణాన్ని గ్రేటర్‌ ఎన్నికలనాటికి లబ్దిదారులకు పంపిణీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ఇందుకు అనుగుణంగా అధికారులు నిధులకోసం ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపుతున్నారు.  గ్రేటర్‌లోని పేదలకోసం ఒక లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 55075ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో పురోగతిలో ఉంది. ఇందులో దాదాపు 38ప్రాంతాల్లో సుమారు 10వేల ఇళ్లు నగరంలో ఇన్‌-సిటూ(గుడిసెలను తొలగించి వాటి స్థానంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం) విధానంలో నిర్మిస్తుండగా, మిగిలినవి రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ప్రభుత్వ ఖాళీజాగాల్లో నిర్మిస్తున్నారు. కొల్లూరు, అహ్మద్‌గూడ, రాంపల్లి, గాజులరామారం, బాచుపల్లి, డీ.పోచంపల్లి తదితర ప్రాంతాల్లో వేలసంఖ్యలో ఇళ్లున్న పెద్ద కాలనీలను నిర్మిస్తున్నారు. నాచారంలోని సింఘంచెరువు తండాలో ఇన్‌-సిటూ పద్ధతిలో నిర్మించిన సుమారు 176ఇళ్లను ఇదివరకే లబ్దిదారులకు పంపిణీచేశారు. మొత్తం ప్రాజక్టు వ్యయం రూ. 9964.59కోట్లు కాగా, అందులో ఇప్పటికే రూ.  4450.00కోట్లు ఖర్చుచేశారు. ఇంకా రూ. 5514.59కోట్లు అవసరం కాగా, వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తంచేసింది. గత ఆగస్టునుంచి  దాదాపు రూ. 990కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నా యి. 


దీంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మరోవైపు, లబ్దిదారుల ఎంపిక పూర్తికాకపోవడం తో పూర్తైన ఇళ్లను కూడా జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకోవడంలేదు. దీంతో వాటికి ఏర్పాటుచేసిన తలుపులు, కిటికీలు, నల్లాలు వంటివి చోరీకి గురికాకుండా కాపాడడం కాంట్రాక్టర్లకు భారంగా మారింది.  నగర పేదలకోసం నిర్మిస్తున్న ఒక్కో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి సుమారు రూ. తొమ్మిది లక్షల వరకు ఖర్చవుతుండగా, ఇందులో ఒక్క రూపాయి కూడా లబ్దిదారునుంచి వసూలుచేయకుండా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తున్న విషయం విధితమే. 


మొత్తం 117లొకేషన్లలో ఒక లక్ష గృహాలు నిర్మిస్తుండగా, అందులో నగరం వెలుపల నిర్మిస్తున్న 55కాలనీల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. దీంతో ఈ 55కాలనీల్లో ఎస్‌టీపీలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆయా కాలనీలవారీగా ఎక్కడ ఎంత సామర్థ్యంగల ఎస్‌టీపీ నిర్మించాలో, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలో గుర్తించిన అధికారులు వాటి ఏర్పాటుకు సంబంధంచిన ఏజెన్సీలను కూడా ఎంపికచేశారు. ఇందులో తక్కువ ధరకు పనులు చేపట్టేందుకు ముందుకొచ్చే ఏజెన్సీలను టెండర్ల పద్ధతిలో ఎంపికచేసి బాధ్యతలు అప్పగిస్తారు. నిధులు విడుదలైతే ఎస్‌టీపీల నిర్మాణానికి కూడా అడ్డంకులు తొలగినట్లేనని అధికారులు తెలిపారు.


 • డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్రాజెక్టు వ్యయం వివరాలు(కోట్లలో)....
 • ప్రాజెక్టు వ్యయం- 8598.58
 • పెరిగిన స్టీలు ధరల సర్దుబాటుకు అదనపు మంజూరీ- 750.00
 • ఇతర విభాగాల మౌలిక సదుపాయాలకు- 616.01
 • మొత్తం ప్రాజెక్టు వ్యయం- 9964.59
 • ఇప్పటివరకు గృహనిర్మాణ శాఖ నుంచి విడుదలైనవి- 4450.00
 • కాంట్రాక్టర్లకు జారీచేసిన బిల్లులు- 4450.00
 • పెండింగు బిల్లులు- 996.79
 • ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కావాల్సిన నిధులు- 5514.59


logo