బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 06, 2020 , 02:13:14

ఐదంతస్తుల ఎత్తులో జూబ్లీ మెట్రో స్టేషన్‌

ఐదంతస్తుల ఎత్తులో జూబ్లీ మెట్రో స్టేషన్‌
  • - ‘మెట్రో’లో అత్యంత ఎత్తయిన నిర్మాణం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టులో అత్యంత ఎత్తయినదిగా జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నిలిచింది. దీన్ని ఐదు అంతస్తుల ఎత్తులో నిర్మించారు. సికింద్రాబాద్‌ వైఎంసీఏ కూడలి వద్ద గతంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ ఉండటంతో దానికి  సమాంతరంగా నాగోల్‌- రాయదుర్గం మెట్రో మార్గాన్ని నిర్మించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు నిర్మాణాల పైన కారిడార్‌-2లోని జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గంలో దీన్ని 63 అడుగుల ఎత్తులో నిర్మించారు.


హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టులో అత్యంత ఎత్తైన స్టేషన్‌గా జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నిలిచింది. సుమారు ఐదు అంతస్తులతో అత్యంత ఎత్తైన ట్రాక్‌పై రైలు ప్రయాణం నిజంగా గొప్ప అనుభూతి నివ్వనున్నది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచే జేబీఎస్‌ బస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా ఇది ప్రయాణికులకు సేవలందించనున్నది. అయితే ఇది ఇంత ఎత్తులో నిర్మించడానికి కారణముందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌ వైఎంసీఏ కూడలి దగ్గర గతంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జీ ఉంది. ఈ ఫ్లైఓవర్‌కు సమాంతరంగా కారిడార్‌-3లో భాగంగా నాగోల్‌ స్టేషన్‌ నుంచి రాయదుర్గ వెళ్ళే మెట్రోరైలు మార్గాన్ని నిర్మించారు. అయితే రెండు నిర్మాణాల పై నుంచి కారిడార్‌-2లోని జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గాన్ని 63 అడుగుల ఎత్తులో నిర్మించారు.


వస్తువు పోగొట్టుకుంటే 90 రోజుల్లో ప్రయాణికుడికి అప్పగింత

మెట్రోరైలు ప్రయాణంలో మీ వస్తువులు పోగొట్టుకున్నా.. మరిచిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. మెట్రోరైలు సిబ్బంది 90 రోజుల్లో మీకు సురక్షితంగా అందజేస్తారు. వస్తువులు ఆయా స్టేషన్‌ మేనేజర్ల వద్ద జాగ్రత్తగా ఉంచుతారు. మరింత సమాచారం కోసం కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ 040-23332555కు సమాచారమిస్తే మీ వస్తువులు జాగ్రత్తగా సేకరించి అందచేస్తారు.


టైం టేబుల్‌ అవసరం లేని మెట్రో

మెట్రోరైలుకు టైం టేబుల్‌ అవసరం లేదని మెట్రో అధికారులు చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతీ 6 నిమిషాలకు ఒక మెట్రోరైలు అందుబాటులో ఉంటుంది. రద్దీ సమయంలో ప్రతీ మూడున్నర నిమిషాలకు ఒక రైలు చొప్పున ప్రతిరోజు 710 ట్రిప్పులు నడుస్తున్నాయి. ప్రతి ట్రిప్పులో ఏకకాలంలో వెయ్యిమంది ప్రయాణికులను, గంటలో 50 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నది.


మెట్రోతో పర్యావరణ పరిరక్షణ

మెట్రోరైలు వల్ల పర్యావరణ పరిరక్షింప బడుతున్నది. సగటున ఒక రైలు 24 ప్రైవేటు కార్లకు సమానం. అలాగే మెట్రో ఏడు ఆర్‌టీసీ బస్సుల కంటే ఎక్కువమంది ప్రయాణికులను తమ గమ్యానికి చేరుస్తున్నది. గత రెండేండ్లలో  మెట్రోరైలులో 9 కోట్ల మందికి పైగా ప్రయాణించారని హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెట్రోరైలు ప్రయాణం కారణంగా 39 వేల టన్నుల కార్బన్‌డైఆక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించినట్లు అధ్యయనంలో తేలింది. మెట్రోలో ప్రయాణించడం వల్ల 1.7కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయినట్లు పేర్కొన్నారు. మెట్రోరైళ్ల గమనంలో వేసే బ్రేకులతో 2.2 కోట్ల కిలో వాట్‌పవర్స్‌ ఇంధన శక్తి ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు.


నగర ముఖ చిత్రం.. మెట్రోతో మారింది

మెట్రోరైలు నిర్మాణంతో నగర ముఖ చిత్రం మారిందని ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు . అన్ని వర్గాలకు సులభమైన మొబిలిటీ సౌకర్యం ఏర్పడిందని తెలిపారు. ప్రయాణికులను హైదరాబాద్‌ మెట్రోరైలు సురక్షితంగా నిర్ణీత సమయంలో గమ్యస్థానాలకు చేర్చుతుందన్నారు.

- ఎండీ కేవీబీ రెడ్డి, ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు 


logo