రాజన్న సిరిసిల్ల, జూలై 2 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్:పాలనను మరింత చేరువ చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా, సిరిసిల్లలో కొత్త కలెక్టరేట్ రెడీ అయింది. మంత్రి కేటీఆర్ చొరవతో సరికొత్తగా రూపుదిద్దుకు న్నది. సువిశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయాలను నిర్మించగా, పేదలకు పాలన మరింత చేరువ కానున్నది.
జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం 93.3ఎకరాల్లో 72 కోట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. బైపాస్ రోడ్డులో 2017 నవంబర్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించగా, అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణ పనులను ఇప్పటికే పలుసార్లు స్వయంగా పరిశీలించారు. జీ+2 పద్ధతిలో నిర్మిస్తున్న ఈ భవన సముదాయంలో మొత్తం 56 శాఖలకు గదులు కేటాయించేందు కు ఏ, బీ, సీ, డీలుగా బ్లాకులు విభజించారు. ఒక్కో బ్లాకు లో 29 గదులున్నాయి. 800 మంది కూర్చుండేలా విశాలమైన సమావేశ మందిరం నిర్మించారు.
భవనంపైన రెండంతస్థులకు వెళ్లడానికి మూడు వైపులా మెట్లతో పాటు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అవసరాన్ని అయిదు అంతస్తులకు పెంచుకునేలా ఏర్పాటు చేశారు. అధికారుల నివాస గృహాల సముదాయాన్ని సైతం జీ+2 విభాగంలో నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్ పక్కనే ఎస్పీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. కలెక్టరేట్ ముఖద్వారానికి ఎదురుగా 70 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకం ఎగిరేలా ఏర్పాటు చేస్తున్నారు. సమీకృత కలెక్టరేట్ చుట్టూ 30 ఫీట్ల రోడ్లు, జంక్షన్లు, పార్కులు నిర్మిస్తున్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో వంద వర కు వాహనాలను పార్కింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. బయటి నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కలేక్టరేట్ ప్రధాన ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారం నుంచి నాలుగు వరసల రహదారిని నిర్మించారు. ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి, పచ్చదనంగా మార్చారు. కలెక్టరేట్, రగుడు జంక్షన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
తప్పనున్న తిప్పలు..
ఇప్పటి వరకు జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం ఒకచోట, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వేరొక చోట ఉంటూ వస్తున్నాయి. ఫలితంగా పనుల కోసం అధికారులను కలిసేందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక పని చేసుకోవాలంటే ఒక్కోసారి రెండు మూడు రోజులు పట్టిన సందర్భాలున్నాయి. ఇటువంటి ఇబ్బందులకు ఫుల్స్టాప్ పెడుతూ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ పూర్తయింది. ఇకపై జిల్లావాసులు తక్కువ సమయంలో పనులు పూర్తి చేసుకునే అవకాశముంటుంది.