పొద్దుతిరుగుడు గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. వీటిని తింటే కొవ్వుశాతం పెరుగుతుందనే భయాన్ని వీడాలని చెబుతున్నారు.
మెదడు పనితీరు
పొద్దుతిరుగుడు గింజల్లో ఐరన్, జింక్, రాగి సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి సాయపడతాయి. వీటిలో విటమిన్-బి, సెలీనియం వంటి మినరల్స్ అధికం. విటమిన్-ఇ పుష్కలం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ఒత్తిడిని నియంత్రిస్తాయి.
రోగ నిరోధక శక్తి
పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలం. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. పరోక్షంగా మధుమేహం, అల్జీమర్స్, ఊబకాయం, క్యాన్సర్, పార్కిన్సన్ వంటి వ్యాధులను అరికడతాయి.
గుండె పదిలం
తగిన విశ్రాంతి లేకపోతే రక్తనాళాలు గట్టిపడతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పొద్దుతిరుగుడు విత్తనాలలోని ప్రత్యేక గుణాలు రక్తనాళాలకు విశ్రాంతి దొరికేందుకు సాయపడతాయి.
నరాలు బలోపేతం
పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. శరీరంలో రసాయన ప్రతిచర్యలను నివారించడంలో ఇవి దోహదపడతాయి. ఈ గింజల వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. నరాల పనితీరు మెరుగవుతుందని కూడా వెల్లడైంది.
చక్కెర నియంత్రణ
పొద్దుతిరుగుడు గింజల్లో క్లోరోజెనిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. రోజూ ఒక టీస్పూన్ కాల్చిన లేదా నానబెట్టిన పొద్దుతిరుగుడు గింజలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.