నేను ఇప్పుడు ఎనిమిదినెలల గర్భవతిని. నెలవారీ పరీక్షలన్నీ సక్రమంగానే చేయించుకున్నాను. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలేవీ లేవు. ఇరవై వారాలప్పుడు చేసిన స్కాన్ బాగానే ఉంది. ఆ తర్వాత బేబీ గురించి చేసిన స్కాన్‌లో ‘వాటర్ చాలా ఎక్కువై పోయింది. శిశివు పొట్ట (జీర్ణాయశయం) సరిగా కనిపించట్లేదని, బహుశా అన్ననాళ నిర్మాణం సరిగ్గా జరగకపోయి ఉండొచ్చ’ని అన్నారు. వాళ్లన్నదే నిజమైతే.. బిడ్డ పుట్టిన తర్వాత ఎటువంటి వైద్యం అవసరమంవుతుంది. ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలా?
మీరు చెప్పే వివరాల ప్రకారం.. మీకు ఈసోఫేజీల్ అట్రేషియా (పిండస్థ దశలో అన్నవాహిక నిర్మాణం సరిగా జరగకపోవడం) ఉండి ఉండొచ్చు. పిండాభివృద్ధి దశలో అన్నవాహిక, శ్వాస నాళం ఒకే నాళం నుంచి వేరుపడి, రెండు వేర్వేరు నాళాలుగా రూపొందుతాయి. అన్నవాహిక జీర్ణాశయంతో అనుసంధానమై ఉంటుంది. శ్వాసనాళం ఊపిరితిత్తులలోకి తెరుచుకుంటుంది. పిండాభివృద్ధి జరిగేటప్పుడు ఈ చీలిక సరిగా జరగకపోతే అన్ననాళం ముందు మూసుకుపోవడం లేదా అన్నవాహిక చివరివైపు శ్వాసనాళానికి అతుక్కుని ఉండటం జరుగుతుంది. ఈసోఫేజీల్ అట్రేషియా, ట్రేకియో ఈసోఫేజీల్ ఫిస్టులా సమస్య అయి ఉండడానికి ఆస్కారముంది. ఈసోఫేజీల్ అట్రేషియా సమస్యను బిడ్డ పుట్టిన తర్వాత పరీక్షలు చేసి మాత్రమే నిర్ధారణ చేయగలం. ట్రేకియా ఈసోఫేజీల్ ఫిస్టులా, ఈసోఫేజీల్ అట్రేషియానే ఉన్నట్లయితే ఆపరేషన్ చేసి నయం చేయవచ్చు. ఇలా అనుమానం ఉన్నప్పుడు.. బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే పరీక్ష చేయాలి. పాలు ఇవ్వకుండా ట్యూబ్ వేసి, ఎక్స్‌రే తీసి సమస్యను నిర్ధారించాలి. కేవలం ఈసోఫేజీల్ అట్రేషియానే అయితే ఆపరేషన్ తర్వాత పెద్దగా ఇబ్బంది ఉండదు. పెద్దయ్యాక మామూలుగా ఉంటారు. కానీ, బిడ్డకు ఈ సమస్య మాత్రమే ఉందా? దీనితోపాటు వేరే అవయవాల్లోనూ నిర్మాణ లోపం ఉందేమో పరీక్షించాలి! గుండె, కాలేయం, కిడ్నీ వంటి అవయవాల్లో ఏదైనా నిర్మాణ లోపం ఉందని ఉంటే.. జన్యు సంబంధమైన సమస్యలున్నట్లుగా అనుమానించాలి. కేవలం ఈసోఫేజీల్ అట్రేషియానే ఉండి ఉంటే ఆపరేషన్‌తో నయం చేయవచ్చు. పుట్టిన వెంటనే బిడ్డకు ఆపరేషన్ చేయగల వైద్యలు, వసతులు ఉన్న హాస్పిటల్లో ప్రసవం కోసం చేరడం మంచిది. అప్పటి దాకా వైద్య పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ల సలహాలు పాటించండి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్