మాతృత్వం మహిళలకు ఓ వరం. గర్భిణులు వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు కడుపులో ఉన్న శిశువు గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. గర్భస్థ శిశువు ఎదగడానికి అవసరమయ్యే సమతుల ఆహారం తినాలని నిపుణుల సూచన. గర్భధారణ సమయంలో స్త్రీల శరీరానికి జింక్ ఎంతో అవసరం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తల్లి, శిశువు ఆరోగ్యానికి జింక్ దోహదం చేస్తుంది. శిశువు మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. జింక్ సంపూర్ణంగా లభించే ఆహారపదార్థాలు ఏవో తెలుసుకుందాం..
చిక్కుళ్లు జింక్ మూలకానికి ఘనమైన మూలాలు. వేరుశనగ, కాయధాన్యాలు, బీన్స్ మొదలైన వాటిలో గర్భిణులకు రోజుకు సరిపడా జింక్ లభిస్తుంది. కాబట్టి వీటిని డైలీ డైట్లో చేర్చుకోవడం అవసరం. ఇవి రోగనిరోధక శక్తి పెంచడానికీ సాయపడతాయి.
బాదం, జీడిపప్పు జింక్ మూలకానికి ఖజానాల్లాంటివి. నానబెట్టిన బాదం, కాజు తినడం వల్ల శరీరానికి సరిపడాజింక్ అందుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల సక్రమంగా సాగుతుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
చికెన్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. చికెన్ సూప్, గ్రిల్డ్ చికెన్ తినడం వల్ల శరీరానికి తగినంత జింక్ అందుతుంది. శాకాహారులు చికెన్‌కి బదులుగా సోయా, పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
గర్భిణులు రోజుకు ఒక గుడ్డయినా తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, డి, ఇ ఉంటాయి. కావాల్సినంత కాల్షియం ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఒక గుడ్డులో 5 శాతం జింక్ ఉంటుంది. ఇది తల్లి ఆరోగ్యానికి రక్షణనిస్తుంది.
ఆలుగడ్డ ద్వారా జింక్ లభిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్‌తోపాటు ఆలూ, చిలుగడదుంపల్ని కూడా తరచుగా తినాలి. ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.